నమస్తే నెట్వర్క్, మే 16 : ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున ఈదురు గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులు తడిసిపోయాయి. పలు చోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోగా, చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలి కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. కురవి, సీరోలు మండలాల్లో కాంటా అయిన ధాన్యం సైతం వర్షానికి తడిసిపోయింది. గంగారం మండలం కొడిశిలమిట్ట గ్రామంలో కల్లంలో తునికాకు కట్టలు చెల్లాచెదురయ్యాయి.
నర్సింహులపేట మండలంలో ధాన్యాన్ని కాపాడుకోవడానికి అన్నదాతలు నానాపాట్లు పడాల్సి వచ్చింది. కల్లాల్లో మిర్చి తడిసి ముద్దయింది. ధాన్యం రాశులపై టార్పాలిన్లు గాలికి లేచిపోవడంతో ముంగిముడుగు, వంతడపలలో కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు తడిశాయి. పెద్దనాగారం కొనుగోలు కేంద్రం లో పైసలు ఇచ్చిన వాళ్ల వడ్లు కాంటాలు పెడుతూ బస్తాలు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. కాంటా పెట్టి న 200 బస్తాల వడ్లు తడిశాయని గుగులోత్ మల్లమ్మ కంట తడి పెట్టారు.
ఏటూరునాగారం మండలంలో ఆరబోసుకున్న, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకున్న ధాన్యంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే ముందు వడగండ్ల వానతో నష్టపోతే ఇప్పుడు తరచూ కురుస్తున్న అకాల వర్షాలతో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం తడిసిపోయింది. పాలకుర్తి మండలంలోని దర్దేపల్లిలో పిడుగు పాటుతో రెండు కాడెడ్లు మృతి చెందాయి. గాలి దుమారానికి పలువురి రేకు ల ఇంటిపై కప్పులు లేచిపోయాయి.