‘కాంగ్రెస్, బీజేపీలు కావాలనే నాపై విష ప్రచారం చేస్తున్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మొద్దు. నేను బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. అధినేత కేసీఆర్ సారథ్యంలో పార్టీ బలోపేతం కోసం ఒక సైనికుడిలా పనిచేస్తా’నని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. మంగళవారం హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గ సమావేశం ఏర్పాటుచేయగా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిలతో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడుతూ తాను బీజేపీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.
కాంగ్రెస్, బీజేపీలు కావాలనే తనపై విషప్రచారం చేస్తున్నాయని ఎర్రబెల్లి మండిపడ్డారు. గతంలో వైఎస్సార్సీపీలోకి రావాలని అనేక ఇబ్బందులు పెట్టినా తాను పార్టీ మారలేదని గుర్తుచేశారు. వ్యాపారాలు, భూ దందాలు, తప్పుడు పనులు చేసిన నాయకులు బీఆర్ఎస్ను వీడుతున్నారని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ కాపాడుతుందని హామీ ఇచ్చారు. మార్పు కావాలని కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన చూసి బీఆర్ఎస్ను ఓడించి తప్పు చేశామని అనుకుంటున్నారని ఎర్రబెల్లి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రుణమాఫీ చేస్తాం, రైతుబంధు ఇస్తామని మోసం చేశారన్నారు. మహిళలకు మహాలక్ష్మీ పథకం ద్వారా రూ.2500 ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు మాత్రమే అమలుచేశారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఉచిత కరెంటు, రూ.500లకే గ్యాస్ అని చెప్పి ప్రజలను ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ సీమ్‌లను ఎత్తేస్తారని ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన ఫెయిల్ అయిందని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచీ మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం అలవాటేనని అన్నారు. వంద రోజుల పాలనలో పంటలు ఎండిపోయాయి, కరెంటు రావడం లేదు, తాగునీరు అందడం లేదని, ఇందుకు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఎండిపోయిన పంటలకు రూ.20వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మండు వేసవిలోనూ చెరువులు నింపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఎన్టీఆర్‌లాంటి నాయకుడికి సైతం ఓటమి తప్పలేదని ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బలహీనపర్చేందుకు కాంగ్రెస్, బీజీపీలు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై నమ్మకంతో వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పేరును ప్రకటించినందుకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన గురించి ప్రజల్లో చర్చ జరుగుతున్నదన్నారు. నాయకులు పోయినా కార్యకర్తలు అధైర్యపడొద్దన్నారు. స్వరాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటైన పార్టీ బీఆర్ఎస్ అని, అందరి సహాయ సహకారాలతో తప్పకుండా గెలుస్తానని కడియం కావ్య ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, రైతుబంధు కమిటీ మాజీ అధ్యక్షురాలు లలి తాయాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పశ్చిమ నియోజకవర్గం సీనియర్ నాయకులు పులి రజినీకాంత్, జోరిక రమేశ్, నయీముద్దీన్, సారంగపాణి, జానకి రాములు, రవీందర్రావు పాల్గొన్నారు.
నేను పుల్టైం పొలిటీషియన్‌ను అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. పార్ట్‌టైం పొలిటీషియన్లు పార్టీ మారినా నష్టం లేదన్నారు. కేసీఆర్ ఫొటోతో గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో అధికారం కోసం మారుతున్నారని అన్నారు. పార్టీ మారిన నాయకులతో క్యాడర్ పోవట్లేదని వర్ధన్నపేట నియోజకవర్గ గులాబీ సైనికులను చూస్తేనే అర్థం అవుతుందని పేర్కొన్నారు. పచ్చని చెట్టుకు ఎండిపోయిన ఆకులు రాలిపోయినా మళ్లీ చెట్టు చిగురిస్తుంది, కాయలు కాస్తాయి.. ఆ ఫలాలను కష్టకాలంలో పార్టీ వెన్నంటి ఉన్నవారికే అందేలా అధిష్ఠానం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నామని తెలిపారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఎండిన పొలాలు, కాలిపోతున్న మోటర్లు కనిపిస్తున్నాయని, ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని.. ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని చోటే భాయ్, కేంద్రంలోని బడే భాయ్ కలిసి కేసీఆర్ మీద కుట్ర పన్నుతూ, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని దాస్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక శక్తిగా 60ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేశారని గుర్తుచేశారు. చిన్న చిన్న పొరపాట్లను సర్దుకొని బలమైన శక్తిగా, ప్రజల మనోభావాలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు. ఇప్పటివరకు తనను గెలిపించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్, వార్రూంతో తనకు ఎలాంటి సంబంధం లేని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రణీత్‌రావు ఎవరో తనకు తెలియదన్నారు. ఆయన అమ్మమ్మ ఊరు, మా స్వగ్రామం పర్వతగిరి అయినంత మాత్రాన ఇద్దరికీ సంబంధం ఉన్నట్టా అని దయాకర్‌రావు ప్రశ్నించారు. ఈ కేసులో తన పేరు చెప్పాలని ప్రణీత్‌రావు మీద ఒత్తిడి తెస్తున్నారని.. దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పారు.