బయ్యారం, జూలై 19 : ‘ఐదు రోజులుగా నీరు రావడంలేదు.. గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు’ అంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చారు. బయ్యారం మండలంలోని ఉప్పలపాడులో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి పోయింది. ప్రత్యామ్నాయంగా జీపీ సిబ్బంది నీటి సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
నీటి సమస్య తీవ్రమవడంతో గురువారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. సమస్య చెప్పుకుందామంటే సర్పంచు లేడని, సెక్రటరీకి చెబితే మోటరు కాలిపోయిందని చెప్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నీరు లేకుంటే ఊళ్లో ఎలా ఉండాలని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ గ్రామంలో నీటి సమస్య తీర్చాలని కోరారు.