LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ ప్రతినిధి సుజాత శర్మ అన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్నప్పటికీ లక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో ఎలాంటి అవాంతరం లేదన్నారు. ఏ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తమకు ఎల్పీజీ కొరతపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
‘‘ప్రస్తుతం నెలకొన్న పశ్చిమాసియం సంక్షోభం నేపథ్యంలో ఎల్పీజీ సరఫరా అంశంపై కచ్చితంగా దృష్టి సారించాలి. ఇప్పటివరకు స్టాక్ లేకపోవడంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. భారత రిఫైనరీల్లో కావాల్సినంత క్రూడాయిల్, చమురు నిల్వలున్నాయి. ప్రస్తుతం బుకింగ్స్ పెరిగాయి. నిన్న 7.5-7.6 మిలియన్స్ బుకింగ్స్ ఉండగా, ఇప్పుడు 8.8 మిలియన్లకు చేరింది. ఎల్పీజీ కొరతపై ఉన్న భయంతో ముందస్తు బుకింగ్స్ చేసుకోవడం వల్లే ఈ పరిస్తితి తలెత్తింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ప్రత్యామ్నాయ వనరులపై దృష్టాసారించాలి. పెట్రోల్, డీజిల్‌కు కూడా ఎలాంటి కొరత లేదు. ఇప్పటికిప్పుడు వీటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్పీజీ వినియోగదారులు తమకు దగ్గర్లో పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) సౌకర్యం ఉంటే అటువైపు తమ కనెన్షన్ మార్చుకోవాలి. ఈ విషయంలో గెయిల్ కూడా నిరంతరం పని చేస్తోంది. వీలునన చోట పీఎన్జీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది’’ అని సుజాత శర్మ తెలిపారు.
మరోవైపు హోర్ముజ్ జలసంధి నుంచి ఇండియాకు సంబంధించిన రెండు నౌకలు బయల్దేరిన సంగతి తెలిసిందే. 92,700 మెట్రిక్ టన్నుల విలువైన ఎల్పీజీ కలిగిన ఈ రెండు నౌకలు ఈ నెల 17న ఇండియా చేరుకుంటాయి. ఇవి వస్తే దేశంలో ఎల్పీజీ కొరత మరింత తీరనుంది. ఇప్పటికీ ఇండియాకు సంబంధించిన 21 నౌకలు ఈ జలసంధి వద్ద చిక్కుకుపోయాయి.