హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయని, ఈ ప్రాజెక్టును తగిన పరిమితులతో ఉపయోగించుకొనే అంశాన్ని పరిశీలించడం లేదని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లో పిల్లర్ కుంగిన వ్యవహారంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదికను అమలుచేయాలని పిటిషనర్ కోరారు.
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌ల రక్షణకు సంబంధించి సాంకేతిక అధ్యయనం చేపట్టి సురక్షితంగా వినియోగించే అంశంపై ప్రభుత్వాలు పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఎస్ శరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులైన కేంద్రం, ఎన్డీఎస్ ఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఇంజినీర్ ఇన్ చీఫ్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.