నల్లగొండ, మార్చి 14 : ఇజ్రాయెల్, ఆమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్టాక్స్ తగ్గినప్పటికీ జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఏలాంటి కొరత లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరా లేదన్న సాకుతో జిల్లాలోని హాస్టళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల భోజనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ప్రిన్సిపాళ్లను, సంక్షేమ శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కృత్రిమ సరఫరా కొరత నేపథ్యంలో గ్యాస్ సక్రమ సరఫరా, పర్యవేక్షణ విషయమై ప్రభుత్వం “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, పౌర సరఫరాల జిల్లా అధికారి కన్వీనర్ గా, పోలీస్ సూపరింటిండెంట్, రెవెన్యూ అదనపు కలెక్టర్, ఓఎంసీ రీజనల్ మేనేజర్, ట్రాన్స్పోర్ట్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా పౌర సంబంధాల అధికారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారి, అన్ని సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఏజెన్సీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన “జిల్లా స్థాయి ఇంధన సరఫరా పర్యవేక్షణ కమిటీ” సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సరఫరాలో తేడా రావడం జరిగిందని, యుద్ధము మొదలైనప్పటినుండి గ్యాస్ సరఫరా కొద్దిగా తగ్గినప్పటికీ గడిచిన నాలుగు రోజుల నుండి మాత్రమే జిల్లాలో సమస్య వచ్చిందని తెలిపారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, కమర్షియల్ స్టాక్స్ మాత్రమే తగ్గాయని స్పష్టం చేశారు. గతంలో సిలిండర్ సరఫరాకు 21 రోజుల సమయం ఉండగా, ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు దానిని 45 రోజులకు మార్చడం జరిగిందన్నారు. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎలాంటి తేడాలు లేనందున డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఎట్టి పరిస్థితులలో ఆగకూడదని చెప్పారు. గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటిలాగే డెలివరీ చేయాలని, ఎక్కడ డెలివరీ ఆపకూడదన్నారు. డొమెస్టిక్ సిలిండర్ లను కమర్షియల్ కు వాడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ చేయడం,డెలివరీ బాయ్స్ ఎక్కువ డబ్బులు తీసుకోవడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి సైతం తెలియజేయాలని చెప్పారు. అలాగే జిల్లా దాటి ఇతర ప్రాంతానికి గ్యాస్ వెళ్లకుండా కట్టుబద్ధమైన చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా అక్రమంగా గ్యాస్ సరఫరా చేస్తున్నా, గ్యాస్ కలిగి ఉన్న సీజ్ చేయాలని, ప్రతి విద్యా సంస్థ, ఆసుపత్రులు ప్రతిరోజు గ్యాస్ పరిస్థితిపై సమీక్షించాలన్నారు. ఈ సందర్భంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా అవుతున్న జిల్లాలోని అన్ని హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే కమర్షియల్ స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు జిల్లా స్థాయి కమిటీ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఏఎస్పీ రమేశ్, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి, జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, కేజీబీవీ, మహాత్మ జ్యోతిబాపూలే, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, సంక్షేమ హాస్టళ్ల ఆర్సివోలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సరఫరాకు కొరత లేదు : కలెక్టర్ బి.చంద్రశేఖర్