నల్లబెల్లి, మార్చి 23 : మిషన్ భగీరథ పైప్ లైన్ కు బొక్క పడింది. పట్టించుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహర్తించడంతో మిషన్ భగీరథ తాగునీరు వృధాగా పోతున్న సంఘటన నల్లబెల్లి మండలంలో వెలుగు చూసింది. నారక్కపేట గ్రామంలో మండలానికి తాగునీటిని అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అతి పెద్ద సంపు నిర్మాణం చేసింది. ఈ సంపు ద్వారా ఇదే గ్రామానికి తాగునీటిని అందించేందుకు ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ పైపులైనుకు బొక్క ఏర్పడి 15 రోజులు గడుస్తుంది.
ప్రతిరోజు స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీరు రోడ్డుపై వరదలా ప్రవహిస్తున్నా ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పైప్ లైన్ కు పడిన రంధ్రం గుండా గ్రామానికి సంబంధించిన డ్రైనేజ్ పైపులోకి వెళుతుందని ఈ కలుషితమైన నీటిని తాగడం వల్ల గ్రామస్తులతోపాటు మండల ప్రజలు సైతం అనారోగ్యాలకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి బొక్క పడిన మిషన్ భగీరథ మెయిన్ లైన్ పైపుకు మరమ్మతులు చేపట్టి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.