కరీమాబాద్, జూలై 12: రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను తరిమికొడదామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆర్టీఏ జంక్షన్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అన్నారు. ‘ఇప్పుడు రైతులకు 3 గంటల కరంటు చాలు అన్నడు. రానురాను అన్ని సంక్షేమ పథకాలను బంద్ చేస్తడు’ అని రేవంత్‌పై ఫైర్ అయ్యారు. పేదలు, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి నాయకులు తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే అన్నారు.
కాంగ్రెస్‌లో కుమ్ములాటలు..
సీట్ల కోసం, పదవుల కోసం కాంగ్రెస్‌లో కుమ్మలాటలు ఉంటాయని, ఇలాంటి వారు ప్రజలను ఏం ఉద్దరిస్తారని ఎమ్మెల్యే నరేందర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని పేదలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లాయన్నారు. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కిరికిరి చేస్తే రైతుల వద్ద ధాన్యం కొన్న ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. ప్రజలను గోస పెట్టే కాంగ్రెస్, బీజేపీని తరిమికొట్టి.. ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలంటే మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు పోశాల పద్మ, సిద్దం రాజు, కవిత, ఉమ, రవి, సురేశ్, కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్, తూర్పు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.