తోరణం కట్టినట్టు దారి పొడవునా ఉన్న పచ్చని చెట్ల వరుస నగరవాసుల్ని కట్టిపడేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనం, ఆహ్లాదం పంచుతున్నాయి. అయితే ఏప్రిల్ నెలలో ఆ చెట్ల ఆకులు రాలినా కొమ్మలకున్న పసుపు వర్ణం పూలు అటుగా వెళ్లే ప్రయాణికులను ఆకర్షించగా ఈ పచ్చని సోయగం సూరీడు సెగనూ మైమరపించేలా చేస్తోంది. ఈ చిత్రం శుక్రవారం వరంగల్ ఎంజీఎం సెంటర్ వద్ద ‘నమస్తే’ కెమెరాకు చిక్కింది.
– ఫొటోగ్రాఫర్, వరంగల్
రహదారిపై పందిరి వేసినట్టు అరుణ వర్ణంలో ఉన్న గుల్మొహర్ పూలు ప్రయాణికులకు స్వాగతం పలుకుతున్న అనుభూతి కలిగిస్తున్నాయి. ఎండవేడిలో నీడనిస్తూ, చల్లదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్న ఈ చెట్లు జనగామ-జీడికల్ మార్గంలో కనిపించాయి. అలాగే అదే దారిలో వెనుక పచ్చని ఆకులతో చింతచెట్టు, ముందుభాగంలో మరోచెట్టు కొమ్మలకున్న పసుపురంగు పూలు కలిసి ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి.
– ఫొటోగ్రాఫర్, జనగామ