భూపాలపల్లి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): భారత్ రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) ఆవిర్భావంతో కొన్ని పార్టీల్లో వణుకు పుట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ శుక్రవారం సీఎం కేసీఆర్ సంతకం చేయడం సంతోషకరమన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై, పార్టీపై చేస్తున్న పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని, బీఆర్ఎస్ కార్యకర్తలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన, రాష్ట్ర లక్ష్యంగా ఏర్పడితే, బీఆర్ఎస్ దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం స్థాపించబడిందని తెలిపారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా పబ్బం గడుపుతోందని, పైగా దేశంలోని ప్రభుత్వ రంగసంస్థలను అదానీ, అంబానీకి తెగనమ్ముతోందని ధ్వజమెత్తారు. దేశ అభివృద్ధి, విభజన హామీల అమలుపై పశ్నించిన సీఎం కేసీఆర్‌కు బీజేపీ నాయకులు సమాధానం చెప్పడంలేదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, ఇండస్ట్రీ పాలసీ తీసుకురాలేదన్నారు. గుజరాత్ రాష్ర్టానికి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పునాదులు కదిలించి రైతు ప్రభుత్వం తేవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 20 హెల్త్‌సెంటర్లకు నూతన భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలకు టీచింగ్, స్టాఫ్ మంజూరు చేసిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు, నిర్మాణం పూర్తయిన సింగరేణి క్వార్టర్లను త్వరలోనే సింగరేణి కార్మికులకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, టీఆర్ఎస్ భూపాలపల్లి అర్బన్ కమిటీ అధ్యక్షుడు కటకం జనార్ధన్, రూరల్ అధ్యక్షుడు పిన్‌రెడ్డి రాజిరెడ్డి, హన్మాన్ టెంపుల్ చైర్మన్ కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు సమ్మయ్య, మౌనిక, రవీందర్, తిరుపతి, రేణుక, పూలమ్మ, మున్సిపల్ కోఆప్షన్ ఇర్ఫానీ, టీఆర్ఎస్ జిల్లా మండల, పట్టణ నాయకులు కళ్లెపు రఘుపతి, మందల విద్యాసాగర్‌రెడ్డి, సెగ్గం క్యాతరాజు సాంబమూర్తి, పిల్లమర్రి నారాయణ, తాటి అశోక్, బీబీ చారి, అజయ్, తిరుపతమ్మ, స్వామి, టీబీజీకేఎస్ నేతలు రత్నం సమ్మిరెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.