కబ్జా చేస్తే కఠిన చర్యలు
రెవెన్యూ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలి
వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీవ్‌గాంధీ హన్మంతు
హనుమకొండ కలెక్టర్‌లో అధికారులతో ప్రత్యేక సమావేశం
పాల్గొన్న వరంగల్ సీపీ తరుణ్‌జోషి
హనుమకొండ, మే 30: ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఈ రెండు జిల్లాల్లో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు తహసీల్దార్లు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
హనుమకొండ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వారికి ప్రభుత్వ పథకాలు కూడా నిలిపివేసే అవకాశం ఉందన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే గుర్తించిన వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీలు వెంకటలక్ష్మి, అశోక్ కుమార్, ఆర్డీవోలు వాసుచంద్ర, మహేందర్‌జీ పాల్గొన్నారు.