ధర్మసాగర్ : తనకు చెందిన వ్యవసాయ భూమిని ధర్మసాగర్ తహశీల్దార్ ఇతరులకు అక్రమంగా పట్టా చేశారని ఆరోపిస్తూ బాధితుడు పయ్యావుల సాంబరాజు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి మందు డబ్బాతో ఆత్మహత్య యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన పయ్యావుల మల్లయ్యకు ధర్మసాగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1146/ఏ లో 4.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇదే సర్వే నంబర్ లో ధర్మసాగర్ కు చెందిన అప్పాల సాయిలు, గట్టయ్య, మహేందర్, రవి, రాములు లకు సుమారు 3.01 ఎకరాల భూమి ఉంది.
కాగా, ధర్మసాగర్ రిజర్వాయర్ ముంపు కింద అప్పాల వారి కుటుంబ సభ్యులకు చెందిన 2.38 ఎకరాల భూమి ముంపు కింద పోవడంతో ప్రభుత్వంతో నష్టపరిహారం తీసుకున్నారు. కాగా పయ్యావుల మల్లయ్యకు 4.10 ఎకరాల భూమి ఉండగా 4ఎకరాలు మాత్రమే పట్టా అయ్యింది. మిగతా 10 గుంటల భూమి పట్టా కావాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పాల మహేందర్ అతని కుటుంబ సభ్యులు తహసీల్దార్ తో చేతులు కలిపి గ్రామ పెద్దమనుషులు, మాజీ సర్పంచ్ తో కలిసి ముంపు కింద పోయిన భూమిని తిరిగి పట్టా చేసుకున్నారు. పట్టా చేసుకుని పయ్యావుల మల్లయ్య ఖాస్తులో ఉన్నా భూమిలోకి వచ్చి ఈ భూమి తనదేనని గొడవకు దిగుతున్నారు.
ఈ క్రమంలో పయ్యావుల మల్లయ్య కుమారుడు పయ్యావుల సాంబరాజు ధర్మసాగర్ తహశీల్దార్ కార్యాలయంలో తమ భూమిని వేరే వారికి పట్టా చేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ధర్మసాగర్ తహశీల్దార్ ఫీల్డ్ సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. తదనంతరం తహశీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన సర్వే రిపోర్ట్ ఇవ్వకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఈ సమస్య పై బాధితులు పలు సార్లు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదు. దీంతో విసుగు చెందిన సాంబరాజు సోమవారం మందు డబ్బాతో జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
దీనిపై ధర్మసాగర్ తహశీల్దార్ సదానందంను వివరణ కోరగా.. రికార్డుల పరంగా ఇద్దరికి ఉండాల్సిన భూమిని ఇరువురికి పట్టా చేశామన్నారు. మొఖా మీద వారి ఇరువురు కుటుంబాల మధ్య తగాదాలు ఉన్నాయని, దీనిని సివిల్ కోర్టులో చూసుకోవాలని సూచించినట్లు చెప్పారు. పయ్యావుల సాంబరాజు చేస్తున్న ఆరోపణలు అన్ని ఆవాస్తామని అన్నారు. పయ్యావుల సాంబరాజుకు రికార్డు పరంగా 10గుంటలు భూమిని కూడా నమోదు చేశామని, మొఖా మీద సమస్య ఉంటే వారి ఇరువురు చూసుకోవాలని, రికార్డు పరంగానే ఇద్దరికి పట్టా చేసినట్లు తహశీల్దార్ సదానందం పేర్కొన్నారు. ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో చూసుకోవాలని మాపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు.