హనుమకొండ : కాకతీయ వైద్య కళాశాల(Kakatiya Medical College) మెన్స్, ఉమెన్ హాస్టల్లో పని చేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె. యాదా నాయక్ డిమాండ్ చేసారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలని గురువారం హనుమకొండ కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడుతూ.. కేఎంసీలో పనిచేస్తున్న 86 మంది కార్మికులకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసారు.
గత ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు తీరు మార్చుకోవాలని అన్నారు. ఎనిమిది నెలలుగా వేతనాల కోసం నిరీక్షించడం చాలా బాధాకరం అన్నారు. జిల్లాల కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరారు. లేని పక్షంలో రేపటి నుంచి కార్మికులు సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జిలపల్లి సుధాకర్, నాయకులు అల్లం రమేష్, డి రాణి, అతీక్, శరత్ ప్రశాంత్, కోమల రాజకుమారి, బాబు సుమన్ , నరేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.