Medaram Jathara | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 9: మేడారం జాతరకు వచ్చే భక్తులందరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని వరంగల్ ఆర్టీసీ రీజినల్ ఎండీ విజయభాను సూచించారు. గత మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందని తెలిపారు. ఈ ట్రాఫిక్ జామ్‌కి కారణం సొంత వాహనాలు విరివిగా రావడమేనని అన్నారు. ప్రైవేటు వాహనాలు నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వలన ట్రాఫిక్ జామ్ జరిగి మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రైవేట్ వాహనాల వలన జాతర సమయంలో ప్రమాదాలు కూడా జరిగాయని కావున అమ్మవార్లను దర్శించుకోవడానికి మేడారం వచ్చే భక్తులందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలన్నారు.
మేడారం జాతర సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు, నడపవలసిన బస్సులు, సిబ్బందికి ప్రయాణికులకు ఏర్పాటు చేయవలసిన సౌకర్యాల గురించి వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల మెకానికల్ సూపర్వైజర్లు, ఎస్డీఐలు, సేఫ్టీ వార్డెన్లు, స్టోర్ సూపర్వైజర్లతో వరంగల్ రీజియన్ మేనేజర్ సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని పనులను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. డిపోల వారీగా ఆపరేషన్లకు సంబంధించి పలు సూచనలు చేశారు. మేడారం జాతర 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుందని జాతర కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం గత జాతర సందర్భంగా నడిపిన బస్సులు ప్రయాణికుల కోసం చేసిన ఏర్పాట్లను ఈ జాతరలో నడపాల్సిన బస్సులకు సంబంధించిన ఏర్పాట్లు, సిబ్బందికి, ప్రయాణికుల సౌకర్యాల గురించి సమావేశంలో చర్చించారు. మేడారం జాతర కోసం నడిచే బస్సులన్నీ ఒకే లైన్లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్లేలా డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు మీద బస్సుల ఆపరేషన్ సింగిల్ లైన్లో ఉండేలా చూసుకోవాలని, జాతరకు నడపాల్సిన అన్ని బస్సులను ముందుగానే తనిఖీ చేసి, తగిన మరమ్మతులు చేసి జాతరకు సిద్ధంగా ఉంచాలని సూచించారు. జాతర సమయంలో ఎలాంటి బస్సు రిపేర్లు కానీ ఫెయిల్యూర్లు కానీ రాకుండా చూసుకోవాలన్నారు.
ఎస్డిఐలు, సేఫ్టీ వార్డెన్లు ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ జాతర సందర్భంగా వారికి కేటాయించే మేడారం డ్యూటీల గురించి వివరించారు. అంతే కాకుండా జాతర ఆపరేషన్లలో పాల్గొనే డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితి గురించి కూడా సేఫ్టీ వార్డెన్లు అవగాహన కలిగి ఉండాలని పూర్తి ఆరోగ్యంతో డ్యూటీలు నిర్వహించడానికి వాళ్లకు కావాల్సిన మందులు, వస్తువులు వారితోపాటు ఎల్లప్పుడూ ఉంచుకోవాలని డ్రైవర్లకు తగు దిశానిర్దేశం చేయాలని సూచించారు. స్టోర్ సూపర్వైజర్లందరినీ ఈ మేడారం జాతరకి బస్సుల రిపేర్‌కు కావలసిన అన్ని వస్తువులను ముందుగానే ఇండెంట్ వేసి తెప్పించుకోవాలని సూచించారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని, డిపోల అధికారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం గురించి ప్రయాణికులు అందరికీ తెలియజేయాలని ఆర్ఎం సూచించారు.