ఖిలావరంగల్, మార్చి 10 : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రమాద బీమా పథకం కింద రూ. కోటి బీమా చెక్కును లబ్ధిదారికి అందజేశారు. మంగళవారం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగి ఉప్పల రవి ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. కాగా, అతడి భార్య పుప్పల లత భవానీకి హైదరాబాద్ జోనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ కామేశ్వరరావు టీజీఎస్ రూ.కోట్ల ప్రమాద బీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ జోన్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం 698 బ్రాంచీలతో సేవలు అందిస్తోందన్నారు.
రిటైల్, వ్యవసాయ, ఎంఎస్ఎంఈ, పెద్ద కార్పొరేట్ రంగాలకు సేవలు అందిస్తూ సుమారు రూ.2 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీత ఖాతాదారులకు బ్యాంక్ ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. ఇందులో భాగంగా రూ.1.00 కోట్ల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ, రూపే డెబిట్ కార్డు ద్వారా అదనంగా రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు బీమా రక్షణ, రూపే కార్డు ద్వారా రూ.1.00 కోట్ల ఎయిర్ యాక్సిడెంటల్ కవరేజీ, రిటైల్ రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు, లాకర్ అద్దెలపై రాయితీలు వంటి అనేక ప్రయోజనాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్నట్లు చెప్పారు.
టీజీఎస్ ఆర్టీసీతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు జీతాల ఒప్పందం ఉన్నదని, సుమారు 33 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు తమ జీత ఖాతాలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ జీతాల ఒప్పందం కింద ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.00 కోట్ల ప్రమాద బీమా కవరేజీ అందించబడుతుందని, అదే పథకం కింద పుప్పల లత భవానీకి బీమా చెక్కు అందజేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ రీజియన్ డీజీఎం, రీజినల్ హెడ్ కమలాకర్ గంటి, టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం విజయ్ భాను, పరకాల డిపో మేనేజర్ రామ్ ప్రసాద్, ఖాతాదారు అధికారి రవీందర్, టీజీఎస్ ఆర్టీసీ అధికారులు సైదులు, పీ శ్రీరామ్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు.