ఖిలావరంగల్, మార్చి 13: నగరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రేటర్ వరంగల్ 38వ డివిజన్ పరిధిలో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది కాలనీలలో పర్యటిస్తూ శుభ్రత పనులను చేపట్టించారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం, రహదారులను శుభ్రం చేయించడం, డ్రైనేజీలను శుభ్రపరచించడం వంటి పనులు మున్సిపల్ సిబ్బందితో చేయించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నగరాన్ని శుభ్రంగా, అందంగా మార్చడం లక్ష్యంగా అధికారులు, ప్రజలు కలిసి పనిచేయాలని సూచించారు.
ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.