హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 24 : కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాలని టీపీటీఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి రావుల రమేశ్‌లు డిమాండ్ చేశారు. హనుమకొండ కిషన్‌పురలోని చైతన్య యూనివర్సిటీలో టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యాసదస్సు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టంలో విద్యారంగ విధ్వంసం కొనసాగుతూనే ఉన్నదని, ప్రభుత్వ విద్యపట్ల నిర్లక్ష్యం వహిస్తుందని, విద్యాకమిషన్ సిఫార్సులు, కేశవరావు చైర్మన్‌గా ఉన్నతస్థాయి విద్యాకమిటి, ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనలతో అస్పష్టమైన బహుళ విధానాలతో రాబోయే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల మనుగడ, విద్యావిధానం ప్రశ్నార్థకంగా ఉన్నదన్నారు.
ఒకవైపు రాష్ర్ట విద్యాశాఖ ఆధ్వర్యంలో 40 మంది టీచర్లు, అధికారులు స్వీడన్ దేశ విద్యారంగ విధానాలపై అధ్యయనం చేయడానికి వెళ్లారు. స్వీడన్లో మాదిరిగా విద్యను మొత్తంగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించడానికి రాష్ర్ట ప్రభుత్వం సిద్ధపడాలని, చైనా దేశం మాదిరిగా ప్రైవేటు పాఠశాలలను రద్దు చేసి కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి పరిస్థితులల్లో రాష్ర్టంలో ప్రత్యామ్నాయ, ప్రజాతంత్ర విద్యావిధానం కోసం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 30న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ర్ట విద్యాసదస్సును నిర్వహిస్తున్నామని, సదస్సుకు ముఖ్యఅతిథిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కోదండరాం హాజరవుతున్నారని పేర్కొన్నారు.
జాతీయ విద్యావిధానం రాజ్యాంగ విలువలు అంశంపై విద్యాఉద్యమ నాయకులు ప్రొఫెసర్ జి.హారగోపాల్, తెలంగాణలో అసమాన విద్య విద్యారంగ సంక్షోభం అను అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రొఫెసర్ చింతకింది కాశీం, పచ్చిమాసియా యుద్ధం ప్రపంచ రాజకీయాలు అనే అంశంపై ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకులు కే.శ్రీనివాస్ ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు వేలాదిగా ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు అంకం శ్రీనివాస్, ఎస్టీయూ, యూటీఎఫ్ నాయకులు రాంబాబు, రవీందర్‌రాజు, నాయకులు, టీచర్లు ఎండి సుభాని, విజయభాస్కర్, శ్రీలక్ష్మీ, శివచేతన్, మహిపాల్ పట్నాయక్, రాజగోపాల్, రాజు, భాస్కర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.