బచ్చన్నపేట, జూన్ 8 : ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం, పచ్చదనం అందించేందుకు ప్రభుత్వం లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై అస్తవ్యస్తంగా మారింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం లక్ష్మాపూర్లోని పల్లె ప్రకృతి వనం పరిసరాల్లో చెట్లు, పొదలు పెరిగి దారులు కనిపించకుండా పోయాయి. కొన్ని చోట్ల చెత్త, ప్లాస్టిక్ సీసాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
వనంలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఆట స్థల పరికరాలు నిర్వహణ లేక వెలవెలబోతున్నాయి.
ప్రవేశ ద్వారం, సమాచార బోర్డులు పాతబడిపోయి స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. వనాన్ని సందర్శించే ప్రజలకు సరైన సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకుల సంఖ్య కూడా తగ్గినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రకృతి వనాన్ని తిరిగి అభివృద్ధి చేసి, శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వనంలో శుభ్రత, నిర్వహణ పనులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
