హనుమకొండ చౌరస్తా, మార్చి 20 : ఈ నెల 23న చేపట్టిన బీసీల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ర్ట కో ఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం ఎదుట శుక్రవారం బీసీల చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దశాబ్దాలుగా దేశంలో మన లెక్కలు కావాలని ఉద్యమిస్తే ఢిల్లీ దిగివచ్చి దేశవ్యాప్తంగా జరిగే జాతి జన గణనలో సమగ్ర కుల గణన చేపడుతామని ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రకటించగా, బీసీల సుదీర్ఘ కాలంగా ఉన్న ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని బీజేపీ నేతలు దేశమంతా పెడబొబ్బలు పెట్టారన్నారు. దేశం నలుమూలల మరీ ముఖ్యంగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆర్భాటపు ప్రకటనలు గుప్పించడంతో బీసీలు తెగ సంతోష పడగా కేంద్ర ప్రభుత్వం మళ్లీ కొత్త సీసాలో పాత సార అన్న చందంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
కుల గణన లెక్కలు మొదలు కావడానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలతో ఒక గెజిట్ విడుదల చేసిందని, జన గణనలో భాగంగా మొదటి దఫా ఇంటి లెక్కలు మొదలు పెట్టడానికి గెజిట్ విడుదల చేసిన కేంద్రం వారు అడిగిన ప్రశ్నలలో మీరు ఎస్సీనా, ఎస్టీనా అడిగిన ప్రభుత్వం, మీరు బీసీనా అని అడగలేదని ఇలా అడగకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మీకు గిన్నె ఉందా? గిలాస ఉందా? అన్న కేంద్రం, మీ ఇల్లు బీసీదా-కాదా అని ఎందుకు అడగడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్, నాగేశ్, మురళి, తరుణ్, రాజేశ్, అజయ్, సుమన్, నరేందర్, మణి పాల్గొన్నారు.