Satya Nadellah : కృత్రిమ మేథ (Artificial Intelligence) పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు పోతాయనే భయమేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ (Microsoft CEO) సత్యనాదెళ్ల (Satya Nadellah) అన్నారు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. ఏఐవల్ల నాలెడ్జ్ ఆధారిత ఉద్యోగాలన్నీ పోతాయని ఒకవైపు చెబుతారని, మరోవైపు అదే టెక్నాలజీ (Technology) ని అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఉద్యోగాలే పోతాయంటే ఏఐ విజయాన్ని ఎవరు కోరుకుంటారని ప్రశ్నించారు.
ఏఐ రంగం గురించి మాట్లాడుతున్న తీరువల్లే ప్రజల విశ్వాసం దెబ్బతిన్నదని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన ప్రజల్లో బలపడిందని, అందుకే ఏఐపై అనుమానాలు పెరుగుతున్నాయని చెప్పారు. కాలేజీల్లో ఏఐ గురించి మాట్లాడితే వ్యతిరేక స్పందన రావడం కూడా ఈ పరిస్థితికి నిదర్శనమన్నారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే ఏఐవల్ల సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనాలు కనిపించాల్సిన అవసరం ఉందని నాదెళ్ల సూచించారు.
ఉదాహరణకు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే స్థానిక ఉపాధి, పన్ను ఆదాయం, పాఠశాలలు, మౌలిక వసతుల వంటి రంగాలకు ఎలా మేలు జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని నాదెళ్ల అన్నారు. ఏఐ మనుషుల ఉద్యోగాలను లాక్కోవడానికి కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడాలని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏయే కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయో గుర్తించడం, వాటికి తగిన వేతనాలు నిర్ణయించడంలో కూడా ఏఐ కీలకపాత్ర పోషించగలదని తెలిపారు.