వేలేరు: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహసభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య (Thatikonda Rajaiah) పిలుపునిచ్చారు. శనివారం వేలేరు మండలంలోని గుండ్లసాగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ గాదె ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీపై గెలిచి రూ.200 కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయాడని విమర్శించారు.
కడియం శ్రీహరి కి దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆదివారం ఎల్కతుర్తి లో జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు గుండ్లసాగర్ గ్రామం నుండి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ రాష్ట్రం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.