హనుమకొండ చౌరస్తా, మార్చి 31: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న ప్రథమ ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. సర్గుజలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీలో మంగళవారం జరిగిన పోటీలో మంచి పోరాట పటిమ కనబరిచి ఒక స్వర్ణ, రెండు కాంస్య పతకాలు సాధించగా అథ్లెటిక్స్‌లో రజతం సాధించారు. రెజ్లింగ్ మహిళల 57 కేజీల విభాగంలో నాగలక్ష్మి పసిడి పతకం సొంతం చేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఆమె కర్ణాటకకు చెందిన సాయి సిద్ధిపై 10-0 స్కోర్‌తో ఘన విజయం సాధించింది. గ్రీకో రోమన్ 77 కేజీలో కాంస్య పతక పోరులో జాదవ్ చరణ్ హనీష్‌కుమార్(ఛత్తీస్‌గఢ్)పై 8-0 తేడాతో గెలుపొంది కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
పురుషుల గ్రీకో రోమన్ 135 కేజీల నార్డిక్ విభాగంలో రాజు కాంస్య పతకం గెలుచుకున్నాడు. జగ్దల్పూర్లో జరిగిన అథ్లెటిక్స్‌లో 110 మీటర్ల హడ్డిల్స్లో దత్తు రజతం సాధించడం విశేషం. ఈ సందర్భంగా రాష్ర్ట క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్అథారిటీ చైర్మన్ శివసేనరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండి సోనీ బాలాదేవి, హనుమకొండ జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్, రెజ్లింగ్ కోచ్ మూడ్ జైపాల్‌లు అభినందించారు.