హనుమకొండ చౌరస్తా, మార్చి 3: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో విద్యార్థులు ఘర్షణకు దిగారు. నిట్ క్యాంపస్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ మరిచిపోకముందే మరో ఘటన చోటు చేసుకోవడం కలకలంరేపింది. స్ప్రింగ్స్ప్రీలో భాగంగా జరిగిన ఈవెంట్ కారణంగా విద్యార్థులు కొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, విద్యార్థులు క్యాంపస్లో కొట్టుకోవడం కామన్ అయిపోయింది. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీలో చికెన్ లొల్లి మరిచిపోకముందే నిట్ క్యాంపస్లో విద్యార్థులు గొడవకు దిగారు. తన వీడియో తీశాడని వచ్చిన చిన్నపాటి గొడవ తారాస్థాయికి చేరింది. వివరాల్లోకి వెళితే.. నిట్లో స్ప్రింగ్స్ప్రీలో భాగంగా జరిగిన ఈవెంట్లో భాగంగా ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి నా వీడియో తీశావ్ ఫోన్ చూపించమని అడిగితే నేను వీడియో తీయలేదని చూపించకుండా దాటవేసినట్లు తెలుస్తోంది.
రెండు, మూడురోజులుగా ఆ విద్యార్థి వీడియో చూపించకుండా సతాయించడంతో మంగళవారం అడగడానికి ఆ విద్యార్థి హాస్టల్కు వెళ్లగా నేను నీ వీడియో తీయలేదని, ఫోన్ చూపించకపోవడంతో మాటమాట పెరిగి ఇద్దరు విద్యార్థులుకొట్టుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న నిట్ అధికారులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. కాజీపేట పోలీసులు సైతం అక్కడికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
విద్యార్థులు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థులందరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ ఘర్షణకు దిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిట్ క్యాంపస్లో విద్యార్థులు మద్యం సేవిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని, విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.