హనుమకొండ చౌరస్తా, మార్చి 23 : కాకతీయ యూనివర్సిటీలో హాస్టళ్లు గాడి తప్పుడుతున్నాయి. వర్సిటీ అధికారుల పట్టింపులేనితనంతో గాలికి వదిలేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చే విద్యార్థులు చిన్నపాటి విషయానికే ఘర్షణకు దిగుతున్నారు. హాస్టళ్లు గొడవలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. పద్మాక్ష్మి హాస్టల్లో విద్యార్థినులు కొట్టడంతో ఆత్మహత్య చేసుకోవడం, చికెన్ కోసం జరిగిన చిన్న గొడవకే కర్రలు, రాడ్లతో తలలు పగలగొట్టుకునేస్థాయి దిగజారుతున్నారు. యూనివర్సిటీ, పోలీసు అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేని తనంతో విద్యార్థుల ఘర్షణలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఇటీవల ఎకనామిక్స్-ఎంబీఏ విద్యార్థులు చికెన్ కోసం లొల్లి, క్రికెట్లో తలెత్తిన చిన్న గొడవతో బీపీఈడీ-ఎంబీఏ విద్యార్థులు గ్రౌండ్లో కొట్టుకున్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన విద్యార్థులు రోడ్డుపైన ఘర్షణ పడ్డారు. కామన్మెస్లో కూడా సీనియర్లు-జూనియర్లు కొట్టుకున్న సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. హాస్టల్‌కు, మెస్‌లో తినడానికి బయటి వ్యక్తులు, విద్యార్థిసంఘాల నాయకులు రావడంతో ఘర్షణలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు విద్యార్థులు రోడ్లపై తిరగడం, డివైడర్లపై కూర్చోవడం, పుట్టినరోజులు వేడుకలు, మందుపార్టీలు యూనివర్సిటీలో కామన్ అయిపోయాయి. హాస్టల్ జాయింట్ డైరెక్టర్లు సైతం తమకేమి పట్టనట్లుగా చోద్యం చేస్తున్నారు.
ఘర్షణ వాతావరణాన్ని తలపిస్తున్న హాస్టళ్లు..
యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చే విద్యార్థుల హాస్టళ్లు ఘర్షణ వాతావరణాన్ని తలిపిస్తున్నాయి. హాస్టళ్లలో ఉండే ఇతర విద్యార్థులు భయాందోళన మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు నిత్యం ఏదో ఒక చోట గోడవలకు దిగడం సాధారణంగా మారింది. ఎంబీఏ, ఎకానామిక్స్విద్యార్థుల మధ్య విభేదాలు ఉండగా పలు విభాగాల విధ్యార్థుల మధ్య ఇప్పటికే నాలుగు సార్లు ఘర్షణలు జరిగాయి. ఇతర పార్టీలు చేయడం వర్సిటీలో నిత్యకృత్యంగా మారింది. ఒక్కరిద్దరి మధ్య ఇక్కడ తలెత్తిన వివాదాలు డిపార్ట్మెంట్ మొత్తానికి ఆపాదించి విభాగాల మధ్య ఘర్షణగా చిత్రీకరించి విద్యార్థులు దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నారు.
చోద్యం చూస్తున్న హాస్టల్ డైరెక్టర్లు..
హాస్టళ్లలో ఇంత జరుగుతున్నా హాస్టల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు చోద్యం చూస్తున్నారు. హాస్టళ్ల నిర్వహణ సక్రమంగా చేపట్టేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు నూతనంగా హాస్టల్ డైరెక్టర్లను నియమించారు. హాస్టళ్లను పర్యవేక్షించడంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే తరుచుగా విద్యార్థుల మధ్య ఘర్షణలు తలెత్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల మెస్‌లో చికెన్ లొల్లిలో అధికారులు ఉంటే ఈ గొడవ జరిగేది కాదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ల పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు రెచ్చిపోయి భౌతిక దాడులకు దిగుతున్నారని తెలుస్తోంది. ఆదివారం వస్తే యూనివర్సిటీ హాస్టళ్లలో ఘర్షణలు జరుగుతున్నాయని, ఎంబీఏ-ఎకనామిక్స్ కాకుండా పలు విభాగాల విద్యార్థుల మధ్య నాలుగుసార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది.
పట్టించుకోని పోలీసులు..
యూనివర్సిటీకి కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవల చికెన్ గొడవ సైతం పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతోనే పెద్దగా మారి తీవ్ర ఘర్షణకు దారి తీసిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ విభాగం విద్యార్ధిపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడంతోనే ప్రతి దాడికి పాల్పడినట్లు విద్యార్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. హాస్టల్ ప్రాంగణంలో సుమారు 50 కలిసి కొట్టుకుంటున్నా ఆపలేదని, వర్సిటీ ప్రాంగణంలోనే పోలీస్ స్టేషన్ ఉన్నా, ఇంటర్‌సెప్టర్ వాహన సాయంతో పోలీసులు నిరంతరం గస్తీ కాస్తున్నా విద్యార్థుల ఘర్షణలను నిలువరించడంలో వారు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు.
రాజీతో మమ అనిపిస్తున్నారు..
కేయూ వీసీ, రిజిస్ట్రార్, పోలీసులు దాడులకు కారణమైన వారితో రాజీ కుదుర్చే ప్రయత్నాలు చేయడంలో ఉన్న ఆసక్తి చర్యలు తీసుకోవడంలో పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా వర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో భయం లేకుండాపోయి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయని వాపోతున్నారు. చికెన్ లొల్లిలో కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సుమారు 40 మంది విద్యార్థులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. కాకతీయ యూనివర్సిటీ చరితలో ర్యాగింగ్‌కు పాల్పడిన సుమారు 81 మంది విద్యార్థినులు సస్పెండ్ చేసిన వర్సిటీ అధికారులు కొట్టుకున్న విద్యార్థులను, విద్యార్థిని మృతికి కారణమైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కమిటీలతోనే కాలయాపన..
వీసీ, రిజిస్ట్రార్ కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని విద్యార్థులు, మేధావులు మండిపడుతున్నారు. ఇప్పటివరకు వందల సంఖ్యలో కమిటీలు వేసి ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. యూనివర్సిటీలో అవినీతికి పాల్పడుతున్న అధికారులు, ఘర్షణకు దిగుతున్నవారిపై తూతూమంత్రంగా పేరుకే విచారణ కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్‌లో జరిగిన చిన్న వివాదం న్యూపీజీ హాస్టల్లో కొట్టుకునేవరకు వెళ్లింది. అమ్మాయిల హాస్టల్లో జరిగిన చిన్న గొడవ ఆత్మహత్యకు దారితీసింది. రూంలో ఉండేవారు కొట్టారని తన వాంగ్మూలంలో పేర్లతో సహా స్పష్టంగా తెలియజేసినప్పటికీ రిజిస్ట్రార్ విచారణకు కమిటీతో కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమిటీ నివేదిక సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో వర్సిటీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తప్పవు..
పద్మాక్షి హాస్టల్లో విద్యార్థినుల మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. విచారణ కోసం కమిటీని నియమించాం. సోమవారం కమిటీ రిపోర్టు మాకు సమర్పించింది. తప్పు ఎవరు చేసినా కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కాకతీ యూనివర్సిటీ రిజిస్ట్రార్
వల్లూరి రాంచంద్రం తెలిపారు.