జగిత్యాల, జూలై 24 : జగిత్యాల జిల్లాలో విషజ్వరాలు విజృంభించి.. రెండు రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. జగిత్యాల రూరల్ మండలం పోరండ్లకు చెందిన కాముని అర్జయ-సరిత కొడుకు కాముని వరుణ్‌తేజ్ కొంతకాలంగా (6) తీవ్రజ్వరంతో బాధపడుతుండగా జగిత్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌కు తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
వరుణ్‌తేజ్ ఇంటి ఎదుట నివసించే దన్నుల నరేశ్-కావేరి దంపతుల కుమారుడు హార్స్మిత్ (6) కొద్ది రోజులుగా విషజ్వరంతో బాధపడుతుండగా, జగిత్యాలలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. గురువారం పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తరలించగా, చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. చిన్నారులిద్దరూ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. ఇద్దరు చిన్నారులు రెండురోజుల వ్యవధిలో మృతిచెందడంతో గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు.