హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): బిడ్డర్ల నెత్తిన మార్క్‌ఫెడ్ ‘మక్కల’ వర్షం కురిపించింది. ఒకేఒక్క దెబ్బతో బిడ్డర్లు తక్కువలో తక్కువగా రూ.76 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది గరిష్ఠంగా రూ.120 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటీవల నిర్వహించిన మక్కల వేలం మార్క్‌ఫెడ్‌కు నష్టాలు మిగిల్చితే.. బిడ్డర్లకు మాత్రం కాసుల వర్షం కురిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మార్కెట్లో మక్కలకు డిమాండ్ ఉన్నదని తెలిసినా, ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నప్పటికీ, మార్క్‌ఫెడ్ అధికారులు పట్టించుకోకుండా వేలం ప్రక్రియ ముగించేశారు. దీంతో తెరవెనుక గూడుపుఠాణి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో మక్కలకు భారీ డిమాండ్ ఉన్నది. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వానకాలం పంటపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే యాసంగి పంటను మార్క్‌ఫెడ్‌తోపాటు ఇతర ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో మక్కలు అందుబాటులోలేవు. తద్వారా మక్కల ధర కూడా భారీగా పెరిగింది. మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ, మార్క్‌ఫెడ్ మాత్రం మక్కలను అగ్గువకే బిడ్డర్లకు కట్టబెట్టిందనే ఆరోపణలొస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాల్ మక్కల ధర రూ.2,400-2600 వరకు పలుకుతున్నది. కానీ, మార్క్‌ఫెడ్ మాత్రం బిడ్డర్లకు వేలం ద్వారా క్వింటాల్‌కు రూ.2,200కే కట్టబెట్టడం గమనార్హం. దీంతో మార్క్‌ఫెడ్, ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు, ఆరోపణలొస్తున్నాయి. మార్కెట్ ధర కన్నా తక్కువకు ఎందుకు విక్రయించాల్సి వచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. యాసంగిలో ప్రభుత్వం 14.7 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేసింది. ఇందులో తొలి దశలో 3.81 లక్షల టన్నులను వేలం ద్వారా విక్రయించింది. 30 లాట్స్గా విభజించి జూన్ 15న వేలం వేసింది. క్వింటాల్‌కు కనీస ధర రూ.2వేలుగా నిర్ణయించింది. వేలంలో సగటున క్వింటాల్‌కు రూ.2,130 ధర వచ్చింది. ఆ తర్వాత బిడ్డర్లతో మార్క్‌ఫెడ్ అధికారులు నిర్వహించిన సంప్రదింపుల్లో క్వింటాల్‌కు రూ.2,200గా ధర ఫైనల్ అయింది. ఈ మేరకు ఈ నెల 17న బిడ్డర్లకు కన్ఫర్మేషన్ ఆర్డర్లను జారీ చేశారు.
మక్కల రూపంలో బిడ్డర్ల పంట పండిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క వేలంలోనే ఏకంగా రూ.100 కోట్లకుపైగా లాభం ఆర్జించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. మార్క్‌ఫెడ్ వద్ద క్వింటాల్‌కు రూ.2,200కు కొనుగోలు చేసిన బిడ్డర్లు.. వాటిని మార్కెట్లో రూ.2,400 నుంచి రూ.2,600 వరకు విక్రయించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. అంటే ఒక్కో క్వింటాల్‌పై రూ.200 నుంచి రూ.400 వరకు లాభం ఆర్జిస్తుండటం గమనార్హం. ఇలా మొత్తం 3.81 లక్షల టన్నులకుగాను బిడ్డర్లు రూ.839.41 కోట్లు ఖర్చు చేయగా వీరికి రూ.200 చొప్పున లాభం లెక్కేస్తే రూ.915.72 కోట్లు రానున్నది. అదేవిధంగా రూ.300 చొప్పున లాభానికి విక్రయిస్తే రూ.953.88 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన వాళ్లు రూ.839 కోట్లకు కొనుగోలు చేయగా వారికి రూ.953 కోట్లు వస్తున్నాయి. అంటే బిడ్డర్లకు రూ.114 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉన్నదనే అంచనాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
మక్కల వేలంలో మార్క్‌ఫెడ్ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తున్నది. 3.81 లక్షల టన్నుల మక్కలను వేలంలో క్వింటాల్‌కు రూ.2,200కు విక్రయించిన అధికారులు… తాజాగా మిగిలిన మక్కల విక్రయానికి మరోసారి టెండర్ వేశారు. ఇందులో మాత్రం క్వింటాల్‌కు కనీస ధర రూ.2,400గా పెట్టడం గమనార్హం. ఈ నెల 17న తొలి టెండర్ బిడ్డర్లకు కన్ఫర్మేషన్ ఇచ్చారు..తాజాగా 22వ తేదీన మరో టెండర్‌ను ఆహ్వానించారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే మార్క్‌ఫెడ్ లెక్కల ప్రకారమే మక్కల ధర క్వింటాల్‌కు రూ.200 పెరిగింది. గతంలో కనీస ధర రూ.2 వేలుగా నిర్ణయించగా రూ.2200కు ఫైనల్ అయింది. ఇప్పుడు కనీస ధర రూ.2,400గా నిర్ణయించగా, అంతకుమించి ధర వస్తుందనే అంచనాలున్నాయి. ఈ లెక్కన తొలిదశలో 3.81 లక్షల టన్నుల మక్కలు రూ.2,200కు ఎలా విక్రయించారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
మక్కలకు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాల్ రూ.2,400 నుంచి రూ.2,500 వరకు పలుకుతున్నది. ఇలాంటి సందర్భంలో పంటలను నిల్వ చేసి అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాల్సిన మార్క్‌ఫెడ్.. ఇంత ఆత్రుతగా మక్కలు విక్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తొలిదశలో విక్రయించిన 3.81 లక్షల టన్నుల మక్కలు బయట ఉన్నాయని, గోదాముల సమస్య ఉన్నదని, వర్షాలు వస్తే పాడైపోయే ప్రమాదం ఉన్నదనే కారణంతో విక్రయిస్తున్నట్టు తెలిపారు. మరి గోదాముల్లో భద్రంగా ఉన్న 10.89 లక్షల టన్నుల విక్రయానికి సైతం వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీని కనీస ధర రూ.2,400గా నిర్ణయించింది. మరికొన్ని రోజుల్లో ధర పెరిగే అవకాశం ఉన్నదనే అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు హడావుడిగా మొత్తం మక్కలను విక్రయించాలనే నిర్ణయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్క్‌ఫెడ్‌లోని ఓ కీలక అధికారి.. బిడ్డర్లతో మిలాఖత్ అయి ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానాలున్నాయి.
3.81 లక్షల మక్కల విక్రయం ద్వారా మార్క్‌ఫెడ్‌కు రూ.267 కోట్ల నష్టం జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం రూ.2,400కు కొనుగోలు చేయగా ట్రాన్స్పోర్ట్, గోదాములు, గోనెసంచులు ఇలా ఖర్చులన్నీ కలిపి రూ.2,900 వరకు అవుతుంది. అంటే 3.81 లక్షల టన్నుల మక్కల కొనుగోలుకు ప్రభుత్వం రూ.1,106.50 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు రూ.2,200కు విక్రయించడంతో రూ.839.41 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఇంకా రూ.267.09 కోట్ల నష్టం వాటిల్లడం గమనార్హం. ధర పెంపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, కొత్త బిడ్డర్లను రానివ్వకుండా పాత వారితోనే పలుమార్లు చర్చలు జరుపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రీ టెండర్ నిర్వహించినా, స్విచ్మోడ్ టెండర్‌కు వెళ్లినా ధర పెరిగేదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.