న్యూఢిల్లీ, జూలై 24: విద్యార్థుల దెబ్బకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన లీకేజ్‌పై జంతర్ మంతర్‌లో నిరసలు కొనసాగిస్తున్న విద్యార్థుల డిమాండ్లకు అంగీకరించిన కేంద్రం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో భారీ ప్రక్షాళన చేపట్టింది. అందులో విధులు నిర్వహిస్తున్న 47 మంది అధికారులపై వేటువేసిన ప్రభుత్వం.. అనేక పోటీ పరీక్షలు, నియామక పరీక్షలు నిర్వహిస్తున్న ఎన్టీఏలో సంపూర్ణ మార్పులను చేపట్టింది. పరీక్ష పేపర్ల లీకేజ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు కేంద్రం నడుం బిగించింది. పరీక్ష పత్రాల లీకేజ్‌లకు కఠినమైన శిక్షలను ఖరారు చేసే ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. లీకేజ్ బాధ్యులకు 10 ఏండ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా గరిష్ఠంగా విధించేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చే ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఎన్టీఏలో సంస్కరణలు..
నీట్ పేపర్ లీకేజ్‌పై విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో 47 మంది అధికారులను ఎన్టీఏ ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసింది. వీరిలో కొందరిపై చట్టపరమైన, క్రిమినల్ చర్యలు ఉంటాయని తెలిపింది. పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్‌ల కారణంగా వివాదాల్లో చిక్కుకున్న ఎన్టీఏలో సమగ్ర మార్పులు తీసుకురావడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. నీట్ యూజీ పేపర్ లీక్‌పై తీవ్రస్థాయిలో వివాదం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం ఎన్టీఏలో భారీ ప్రక్షాళనను చేపట్టింది. ప్రతిపాదిత సమూల మార్పులు ఏజెన్సీ పనితీరును పూర్తిగా మార్చివేసి, జాతీయ స్థాయి పరీక్షలపై ప్రజలకున్న విశ్వాసాన్ని పునరుద్ధరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జేఈఈ, నీట్ వంటి వాటితోసహా 15-20 జాతీయ స్థాయి ప్రవేశ, నియామక పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తున్నది. ఈ ప్రక్షాళనలో ఔట్సోర్సింగ్ ఫ్రేమ్‌వర్క్, కార్యాచరణ ప్రక్రియలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. పర్యవేక్షణను బలోపేతం చేయడానికి, ప్రస్తుతం ఉన్న లోపాలను సరిదిద్దడానికి ప్రభు త్వం ఈ ఏజెన్సీకి చెందిన ఔట్సోర్సింగ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చాలని యోచిస్తున్నది.
10 ఏండ్ల జైలు, రూ.10 కోట్ల జరిమానా
పరీక్ష పత్రాల లీకేజ్‌తో సంబంధం ఉన్న వారికి కఠిన శిక్షలు ప్రతిపాదిస్తూ పేపర్ లీక్‌ల నివారణ చట్ట సవరణల ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు పాల్పడిన వారికి గరిష్ఠంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పేపర్ లీక్ కేసులలో దోషులకు ప్రస్తుత మూడు సంవత్సరాల కనిష్ఠ జైలు శిక్షను ఐదేండ్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై నిరసనలు జరుగుతుండడం, పోటీ పరీక్షల విశ్వసనీయతను పరిరక్షించడానికి కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం తెలిపారు. ఈ బిల్లును తీసుకురావడంలో ఎటువంటి జాప్యం ఉండరాదని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
పాత చట్టంలో మార్పులు
పరీక్ష పత్రాల లీకేజ్‌కి సంబంధించిన వివాదాలు తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్రం 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్(అక్రమ పద్ధతుల నివారణ) చట్టం తీసుకొచ్చింది. దాదాపు నాలుగు నెలల తర్వాత నీట్, నెట్ ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో తీవ్ర ఆందోళనలు నెలకొన్న తరుణంలో 2024 జూన్‌లో ఈ చట్టానికి సబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ చట్టం రాకముందు కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల ద్వారా నిర్వహించే ప్రభుత్వ పరీక్షల ప్రక్రియలో వివిధ సంస్థలు అవలంబించే అక్రమ పద్ధతులు లేదా పాల్పడే నేరాలను అడ్డుకునేందుకు ఎటువంటి నిర్దిష్టమైన సమగ్ర చట్టం లేదు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వేలు, బ్యాంకింగ్ పరీక్షలు, ఎన్టీఏ నిర్వహించే ప్రభుత్వ పరీక్షలలో అక్రమాలను నివారించడం ఈ చట్టం లక్ష్యం.