హనుమకొండ చౌరస్తా, మార్చి 17: కాకతీయ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న శ్రీవిద్య సీనియర్ వేధింపుల వలనే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని, ఇది ముమ్మాటికి యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యమని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఫెడరేషన్, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్, సేవాలాల్ సేన, ఏ.బి.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూలోని లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బిల్డింగ్ లోపల ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థి ఆత్మహత్య కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, శ్రీవిద్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
యూనివర్సిటీ అధికారులైన విభాగాధిపతి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్ల నిర్లక్ష్యం వలనే విద్యార్థిని బలైందని, ఆమె సీనియర్ల విద్యార్థుల భవిష్యత్ ఆగమైందని ఏదైతే ఈ నిర్లక్ష్యం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వీసీ, రిజిస్టర్‌తో వారి ఛాంబర్లో విద్యార్థిసంఘ నాయకులతో చర్చలు జరిపి, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మంద భాస్కర్, బహుజన విద్యార్థి సంఘం నాయకులు బొట్ల మనోహర్, ఏబిఎస్ఎఫ్ నాయకులు మంద నరేష్, సేవలల్సేన నాయకులు అశోక్‌నాయక్, విద్యార్థి సంఘం నాయకులు కుమ్మరి శ్రీనాథ్, రాణాప్రతాప్, ఆరెపల్లి తిలక్, కడదారపు నవీన్, అడ్డూరి గణేష్, పి.రమేష్, డాక్టర్ గుండేటి సుమన్, రజిత, అనూష, హరికృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.