ములుగు, జూలై14(నమస్తేతెలంగాణ) : మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు. సోమవారం ఎస్పీ ఎదుట ఏసీఎంతో పాటు నలుగురు ప్లాటూన్ మెంబర్లు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లొంగిపోయిన వారిలో ఏసీఎం శ్యామల రాజేశ్ అలియాస్ నంద, ప్లాటూన్ మెంబర్లు కడితెల దోమ, ఊకె జోగి, బాడిశ భీమా, ముచాకి జోగి ఉన్నారని తెలిపారు. వీరంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని ఎస్పీ తెలిపారు.
తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25వేలను అందజేశామని, ప్రభుత్వం నుండి వచ్చే సహాయాన్ని త్వరలో అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మావోయిస్టులు లొంగిపోయేందుకు పోలీస్ శాఖ ద్వారా ‘పోరు కన్న ఊరు మిన్న’ ‘మన ఊరికి తిరిగి రండి’ అనే కార్యక్రమ ఫలితంగా 2025 జనవరి నుండి ఇప్పటి వరకు 73మంది వివిధ హోదాలకు చెందిన మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, డీఎస్పీ రవీందర్, పోలీస్ అధికారులు ఉన్నారు.