తొర్రూరు, మార్చి 05 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకు తన కన్నతల్లిపై గొడ్డలితో దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మ బుధవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఇంట్లో నులక మంచంపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఆమె కుమారుడు చిట్టిమల్ల యాకయ్య (అజీమ్) మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. మద్యం తాగడానికి డబ్బులు కావాలని తల్లిని అడగగా, ఆమె వద్ద డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రూ.450 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు తల్లి కాళ్లకు ఉన్న వెండి కడియాలను కూడా తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం.
దీనికి తల్లి లచ్చమ్మ అడ్డుకావడంతో ఆగ్రహించిన యాకయ్య ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని ఆమెపై దాడి చేశాడు. చేతులు, మెడ, ఛాతి భాగాల్లో తీవ్రంగా కొట్టడంతో లచ్చమ్మకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమె కేకలు విని అప్రమత్తమైన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఈఎంటి రణధీర్, పైలెట్ రాజులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన లచ్చమ్మకు ప్రాథమిక చికిత్స అందించి వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు యాకయ్య (అజీమ్)ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తొర్రూరు ఎస్సై గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.