భీమదేవరపల్లి, మార్చి 10 : మహిళలు చదువు ద్వారానే అభివృద్ధి సాధిస్తారని ప్రజా గ్రంథాలయం నిర్వాహకులు డాక్టర్ ఎదులాపురం తిరుపతి అన్నారు. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే(Savitribai Phule) 128వ వర్ధంతిని ముల్కనూరు ప్రజాగ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. సావిత్రిబాయి పూలే ఆమె భర్త జ్యోరావు పూలే సహకారంతో ఎన్నో పాఠశాలలు నెలకొల్పి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు.
ఈ ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో విమర్శలను తట్టుకొని నిలబడిన ధీరవనిత సావిత్రిబాయి పూలే అన్నారు. అనంతరం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగ రవి, నాయకులు డ్యాగల సారయ్య, కవ్వ లక్ష్మారెడ్డి, అప్పని భిక్షపతి, మాడుగుల అశోక్, కూన యాదగిరి పాల్గొన్నారు.