ఖిలా వరంగల్, నవంబర్ 19 : వరంగల్ జిల్లాలోని రేషన్ డీలర్లు దొడ్డు బియ్యం నిల్వలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పంపిణీ చేసిన దాదాపు 847 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోవడంతో రేషన్ షాపుల్లో నిల్వ సామర్థ్యం సరిపోక సన్న బియ్యం పంపిణీ నిర్వహణ పెద్ద తలనొప్పిగా మారిందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 509 రేషన్ షాపుల్లో ఒక్కో షాపులో సుమారు 5 నుంచి 40 క్వింటాళ్లకు పైగా దొడ్డు బియ్యం నిల్వలు పేరుకుపోయాయి.
ఈ ఏడాది మార్చి నెల నుంచి బియ్యం వెనక్కు తీసుకోవాలని డీలర్లు పదేపదే జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకుపోయిన నిల్వల కారణంగా డీలర్లు సన్న బియ్యం పంపిణీ కోసం దొడ్డు బియ్యం బస్తాలను పక్కనబెట్టి స్థలాన్ని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఎక్కువ కాలం నిల్వ ఉండడం వల్ల దొడ్డు బియ్యం పాడైపోతున్నాయి.
ఎలుకలు, పురుగుల వల్ల దొడ్డు బియ్యం పూర్తిగా మట్టిలో కలిసిపోతున్నాయని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దొడ్డు బియ్యం కోసం వచ్చిన ఎలుకలు, పురుగులు ఇప్పుడు సన్న బియ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. కొంత మంది డీలర్లు పాడైన దొడ్డు బియ్యాన్ని శుభ్రం చేయించి మళ్లీ బస్తాల్లో నింపి భద్రత పరుస్తున్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం నిల్వలు ఉండడం వల్ల సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ గందరగోళంగా మారుతోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని, నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.