హనుమకొండ, అక్టోబర్ 14: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పెంచిన మొదటి సెమిస్టర్ ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కేయూలో ఆందోళన చేపట్టారు. కేయూ పరిపాలన భవనం ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. యూనివర్సిటీ ఇచ్చిన ఫీజు పట్టికను అనుసరించకుండా అధిక ఫీజులు తీసుకుంటున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీపై చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్స్అసోసియేషన్(డీఎస్ఏ) డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి సెమిస్టర్ ఫీజు ప్రకటనలో భారీగా మార్పులు జరిగాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేద మధ్యతరగతి కుటుంబాలని వారు పొద్దున లేస్తే ఎర్రని ఎండలో పనిచేస్తూ వాళ్ల పిల్లలు బాగా చదువుకోవాలని ఆశతో డిగ్రీలు చదివిస్తుంటే యూనివర్సిటీ అధికారులు మాత్రం ఏమాత్రం కనికరం లేకుండా భారీగా ఫీజులు పెంచుతుంటే పేద కుటుంబాల విద్యార్థులు ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు.
ఇంతకుముందు ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజు రూ.80 ఇప్పుడు ఏకంగా రూ.1200 పెంచడం సిగ్గుచేటని, వివిధ రకాల పేర్లతో మొత్తం ఫీజు విద్యార్థులు కట్టాల్సింది రూ.1340 కానీ ఇప్పుడు రూ.3250 పెంచడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వెంటనే పెంచిన ఫీజులు మొత్తం తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సంజయ్, జాషువా రాజ్‌కుమార్, శశిధర్, శ్రీధర్, డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు.