Ramoji Rao | మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ ) హైదరాబాద్ చాప్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవ ప్రశంసనీయమని.. ఆయన కీర్తి ఆచంద్రతారార్కమని కొనియాడింది. ఒక మధ్యతరగతి గ్రామీణ వ్యక్తి స్వయం కృషితో, క్రమశిక్షణతో సమున్నత శిఖరాలకు ఎలా ఎదగవచ్చో అయన జీవిత సమరాన్ని చూసి నేర్చుకోవచ్చని పేర్కొంది. ప్రజలలో స్ఫూర్తిని నింపి, శ్రమించి సంపద సృష్టించి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను తయారుచేసిన ఆయన లేని లోటు తీర్చలేనిది అని చెప్పింది.
రామోజీరావు సతీమణి రమాదేవి, ఈనాడు ఎండీ కిరణ్, యావత్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పీఆర్సీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆధునిక జర్నలిజంలో సకారాత్మక మార్పులకు రామోజీ రావు శ్రీకారం చుట్టారని, సమాచార స్రవంతి పట్ల వారికి ఉన్న ప్రత్యేక శ్రద్ధ యావత్ తెలుగు జాతికి ఎంతో ఉపకరించిందని పీఆర్సీఐ చైర్మన్, ఈనాడు జర్నలిజం స్కూల్ 1992 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ ఎస్. రాము చెప్పారు. రామోజీ గ్రూప్స్ తెలుగు జాతికి చేసిన సేవ మరువలేనిదని కార్యదర్శి యాదగిరి కంభంపాటి అన్నారు.
ఈనాడులో పనిచేసి తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో పదవీ విరమణ పొందిన వాకిటి మధు మాట్లాడుతూ.. విలేకరుల విషయంలో రామోజీరావు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వెన్నుతట్టి ప్రోత్సహించేవారని చెప్పారు. ఈనాడు గ్రూప్లో పనిచేసి ప్రస్తుతం ఎన్ఎండీసీలో ఉన్నత స్థానంలో ఉన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రామోజీ ఒక సమున్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కృష్ణ బాజీ, రాజేష్, మోహన్ రావు, సుబ్బారావు తదితరులు పాల్గొని రామోజీ రావుతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.