భీమదేవరపల్లి, మార్చి 23: సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి స్టేజి వద్ద సోమవారం వేకువ జామున వెనుక నుండి బైకును ఢీ కొట్టిన సంఘటనలో కదిరె కిరణ్(35)అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు అంబాల రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామానికి చెందిన అంబాల రాజు వేకువజామునే ఆయన స్వగ్రామం వంగర నుంచి హుస్నాబాద్ కు బైక్ పై వెళుతున్నాడు.
ఈ క్రమంలో మంగళపల్లి స్టేజి వద్ద కదిరె కిరణ్ అతన్ని లిఫ్ట్ అడిగాడు. దీంతో బైక్ పై కిరణ్ కూర్చుంటున్న క్రమంలో వెనుక నుండి అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కిరణ్ అక్కడికక్కడే మృతిచెందగా రాజు పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు 108 లో రాజును అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
అనునిత్యం ఇష్టానుసారంగా టిప్పర్ లారీలు నడుస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ సిద్దిపేట – హనుమకొండ ప్రధాన రహదారిపై మంగళపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించని టిప్పర్ లారీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మృతుడి కుటుంబానికి పరిహారం కల్పించి, రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్, సదరు కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వంగర ఎస్సై దివ్య గ్రామస్తులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు.