హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీలో జీవో 97ను అమలు చేయకూడదని, కాలేజీలో విద్యార్థులు నిరాహారదీక్షలు చేపట్టారు. విద్యార్థులను కార్మికులుగా పరిగణించకూడదని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వరుసగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతున్నారు. శుక్రవారం ఆయన విద్యార్థుల నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి, వారి పోరాటానికి బలమైన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా వారికి అందుబాటులో ఉంటానని, విద్యార్థుల భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన నిలుస్తుందని నరేందర్ భరోసా ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.