Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. ఒక గర్భిణికి మద్యం మత్తులో ఉన్న డాక్టర్ సర్జరీ చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యూపీ, షాజహాన్పూర్ జిల్లాలో ఈ నెల 8న జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలివి. పువాయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకర్హ గ్రామానికి చెందిన జూలీ అనే యువతి గర్భవతి.
ఆమెకు సెప్టెంబర్ 8న సాయంత్రం పురిటినొప్పులు రావడంతో ఒక అంబులెన్సులో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. మార్గమధ్యలో అంబులెన్స్ డ్రైవర్ పువాయాన్ సమీపంలోని ఒక ప్రైవేటు సమీపంలో ఆపాడు. అక్కడే చికిత్స బాగుంటుందని సూచించాడు. దీంతో అప్పటికే నొప్పులతో ఇబ్బంది పడుతున్న జూలీని అదే ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ రాత్రి పూట డ్యూటీలో ఉన్న డా.ఫిరోజ్.. మరో డాక్టర్ కేపీకి సమాచారం అందించాడు. దీంతో డాక్టర్ కేపీ ఆస్పత్రికి చేరుకున్నాడు. అప్పటికే అతడు మద్యం మత్తులో, తూగుతున్నాడు. అయినప్పటికీ సర్జరీ చేశాడు.
జూలీ.. బాబుకు జన్మనిచ్చింది. కానీ, ఆ తర్వాత జూలీ పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను బరేలిలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. వారి సూచన మేరకు జూలీని అంబులెన్సులో తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో మరణించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ మద్యం మత్తులో సర్జరీ చేయడం వల్లే జూలీ మరణించిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.