Cricket Iconic Duos : ప్రపంచ క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లు చాలామందిని చూసే ఉంటాం. కొందరు సొగసైన బ్యాటింగ్‌తో చెరగని ముద్ర వేస్తే.. మరొకొందరు సంచలన బౌలింగ్‌తో రికార్డులు నెలకొల్పారు. అంతర్జాతీయంగా వ్యక్తిగత ఘనతల్ని పక్కనపెడితే.. జోడీగా హిట్టైన వారు మాత్రం కొందరే. ఓపెనర్‌గా, ఆపద్భాదంవుల మాదిరిగా గెలిపించిన ఆటగాళ్లు చాలా తక్కువ. ఇక బంతితో నిప్పులు చెరిగి, బంతిని గింగిరాలు తిప్పిన బౌలింగ్ ద్వయంను వేళ్ల మీద లెక్కించొచ్చు. లెజెండరీ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ నుంచి.. ఈతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వరకూ నమ్మదగిన వారుగా నీరాజనాలు అందుకున్న జోడీలున్నాయి. వీరిలో కొందరు టెస్టుల్లో తమ ప్రతాపం చూపిస్తే.. మిగతావారు వన్డేల్లో తమ తడాఖా చూపించారు.
భారత క్రికెట్లో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాల వారసత్తాన్ని పుణికిపుచ్చుకున్నారు గంగూలీ, సచిన్ ద్వయం. ఒకరు కళాత్మక కవర్ డ్రైవ్స్‌తో అలరించగా.. మరొకరు సిక్సర్లతో హోరెత్తించారు. 1996లో దక్షిణాఫ్రికాపై టైటాన్ కప్‌లో తొలిసారి ఓపెనింగ్ చేసిన సచిన్ – గంగూలీ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు.
Cricket has seen some iconic duos 🤝
(1/5) pic.twitter.com/WfoCbYuIVS
— Cricinfo (@cricinfo) September 11, 2026
ధనాధన్ ఆటతో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో పడేసిన దాదా, మాస్టర్ బ్లాస్టర్ పలు విజయాల్లో భాగమయ్యారు. ముఖ్యంగా వన్డేల్లో ఈ జోడీ సూపర్ హిట్టైంది. ఒక మ్యాచ్‌లో వీరిద్దరి అత్యధిక భాగస్వామ్యం 258 పరుగులు. కెన్యాపై 2001 అక్టోబర్ 24న సచిన్ (146), గంగూలీ (111) శతకాలతో కదం తొక్కారు. మొత్గా 50 ఓవర్ల ఫార్మాట్లో 176 ఇన్నింగ్స్‌ల్లో ఓపెనింగ్ చేసిన ఈ జోడీ 8,227 రన్స్ రాబట్టింది
మెక్ గ్రాత్ – షేన్ వార్న్ : ఆస్ట్రేలియా దిగ్గజాలైన మెక్‌గ్రాత్, దివంగత షేన్ వార్న్ జోడీ అంటే ఒకప్పుడు బ్యాటర్లు హడలెత్తిపోయేవారు. ముఖ్యంగా టెస్టుల్లో వీరిద్దరూ అసీస్‌ను గెలిపించిన సందర్భాలు అనేకం. ఆరడుగులుండే మెక్‌గ్రాత్ బుల్లెట్ బంతులతో భయపెట్టి వికెట్లు తీసేవాడు. మిస్టరీ బౌలింగ్‌తో వార్న్ ప్రత్యర్థిని చుట్టేసేవాడు. ఆసీస్ బౌలింగ్ దళంలో విజయవంతమైన వీరు 104 టెస్టుల్లో కలిసి బరిలోకి దిగారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మెక్‌గ్రాత్.. అంతుచిక్కని లెగ్ స్పిన్‌తో వార్న్ సంయుక్తంగా 1,001 వికెట్లు తీశారు. అందుకే వీళ్లు ప్రపంచం మెచ్చిన బౌలింగ్ ద్వయంగా పేరొందారు.
(2/5) pic.twitter.com/GMrEcljenH
— Cricinfo (@cricinfo) September 11, 2026
వసీం అక్రమ్ – వకార్ యూనిస్ : అనిశ్చితికి కేరాఫ్ అయిన పాకిస్థాన్ క్రికెట్‌కు వైభవాన్ని తెచ్చిన జంట వసీం అక్రమ్ వకార్ యూనిస్. పదునైన పేస్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించిన ఈ ద్వయం పాక్ పేసర్లు యమా డేంజర్ అనిపించుకుంది. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ పంజా విసిరిన ఈ జోడీ పేరిట దాదాపు 2 వేల వికెట్లున్నాయి. సుదీర్ఘ ఫార్మాట్లో 916 వికెట్లు, వన్డేల్లో 918 వికెట్లు తీశారిద్దరూ.

కుమార సంగక్కర – మహేల జయవర్ధనే : చిన్న దేశమైన శ్రీలంక క్రికెట్లో అంతర్జాతీయ గుర్తింపు సాధించడంలో సంగక్కర, జయవర్ధనే పాత్ర ఎనలేనిది. దూకుడే మంత్రగా బౌలర్లపై విరుచుకుపడిన ఈ ద్వయం మాతో జాగ్రత్త అని హెచ్చరికలు పంపింది.
2006లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో దక్షిణాఫ్రికాపై 624 రన్స్‌తో రికార్డు నెలకొల్పిన వీరు.. వన్డేల్లోనూ చెలరేగారు. పదేళ్లకు పైగా మిడిలార్డర్లో విలువైన భాగస్వామ్యాలతో జట్టును గెలిపించారిద్దరూ. వన్డేల్లో 148 ఇన్నింగ్స్‌ల్లో 15 శతకాలు, 35 అర్ధ శతకాలు కలిపి 5,992 పరుగులు రాబట్టిందీ జోడీ.

స్టువార్ట్ బ్రాడ్ – జేమ్స్ అండర్సన్ : ఇంగ్లండ్ క్రికెట్లో ఓ వెలుగు వెలిగిన బౌలర్లు స్టువార్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్. ఇంగ్లండ్ పేస్ దళానికి దశాబ్ద కాలంపైగా నాయకత్వం వహించిన అండర్సన్, స్టువార్ట్ బ్రాడ్ దాదాపు 350 మ్యాచులు ఆడారు. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన ఈ లెజెండరీ పేస్ ద్వయం 1,308 వికెట్లు తీసింది. అంతేకాదు సంయుక్తంగా సుదీర్ఘ ఫార్మాట్లో 600 మందిని ఔట్ చేసిన ఇంగ్లండ్ మొదటి పేస్ జంటగా వీరు రికార్డు నెలకొల్పారు. బ్రాడ్ 167 టెస్టుల్లో 604 వికెట్లతో కెరీర్ ముగించగా… జిమ్మీ 188 మ్యాచుల్లో 704 వికెట్లతో వీడ్కోలు పలికాడు.

చమిందా వాస్ – ముత్తయ్య మురళీధరన్ : ఒకరేమో ఎడమచేతి వాటం పేసర్, మరొకరు మణికట్టు మాంత్రికుడు. 1990 నుంచి 2000 సంవత్సరం మధ్యలో శ్రీలంక బౌలింగ్ దళంలో కీలకమైన ఈ జోడీ మేటి ఆటగాళ్లను సైతం వణికించింది. వన్డేలు, టెస్టుల్లో అద్భుతంగా రాణించిన వాస్ టాపార్డర్‌ను పడగొడితే.. అర్ధంకాని ఆఫ్‌స్పిన్‌తో మురళీధరన్ మిడిలార్డర్, టెయిలెండర్లను సాగనంపేవాడు. లంక క్రికెట్లో విజయవంతమైన ఈ బౌలింగ్ ద్వయం సంయుక్తంగా 348 మ్యాచులు ఆడి 2,108 వికెట్లు తీసింది.

మాథ్యూ హేడెన్ – జస్టిన్ లాంగర్ : విధ్వంసక ఆటతో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి బాటలు వేశారు మాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్. భారీ కాయుడైన హెడెన్ తుఫాన్ ఆటతో బౌలర్లను భయపెట్టగా, చాప కింద నీరులా లాంగర్ టన్నుల కొద్దీ రన్స్ సాధించాడు. టెస్టుల్లో విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా కితాబులందుకున్న ఈ ద్వయం 113 మ్యాచుల్లో 5,655 పరుగులు చేసింది. ఇందులో 14 శతకాలు, ఆరు డబుల్ సెంచరీల భాగస్వాములు ఉన్నాయి.
రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ : టీమిండియాలో హిట్ పెయిర్‌గా ప్రశంసందుకున్న విరాట్ కోహ్లీ- రోహిత్ శర్మలు ఎన్నో విజయాలందించారు. ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ దంచేస్తే.. మిడిల్ ఓవర్లలో ఇద్దరూ ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాగేసుకునేవారు. ఛేజ్ మాస్టర్‌గా విరాట్ అవతరించడంలో.. అతడికి సహకరించిన రోహిత్ పాత్రను మరువలేం.

వీరి జోడీ ఇప్పటివరకు వందకు పైగా వన్డేల్లో 5,790 పరుగులు సాధించింది. దశాబ్దంపైగా టీమిండియాకు తరగని ఆస్తిలా మారిన వీరు.. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఆడాలనుకుంటున్న రోకో భవితవ్యం త్వరలో స్వదేశంలో జరుగనున్న వెస్టిండీస్ పర్యటనతో స్పష్టం కానుంది.