– బీసీ కులాలకు యూనిక్ కోడ్ కేటాయించాలి
– తెలంగాణ రాష్ట్రg నిర్వహించిన మాదిరిగా జన గణన చేపట్టాలి
– బీసీల ధర్మ పోరాట దీక్షలో నేలపట్ల సత్యనారాయణ
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 11 : దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో కుల గణన చేపట్టాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్మ పోరాట దీక్షలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగణన చేపట్టాలని, అందుకు గాను ప్రతి కులానికి ఒక యూనిట్ కోడ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాల అవుతున్నప్పటికీ ఇప్పటివరకు బీసీల జనాభాను లెక్కించకపోవడం దురదృష్టకరమన్నారు. బీసీల జనాభాను లెక్కించడం వలన బీసీల యొక్క హక్కులను అడుగుతారని ఉద్దేశంతో అగ్రకుల ఆధిపత్యంలో నడుస్తున్న బిజెపి పార్టీ దురుద్దేశంతో ఈ ప్రక్రియను చేపడం లేదని అన్నారు. ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి పక్షులకు లెక్కలు ఉన్నాయి కానీ బీసీ కులాలకు మాత్రం లెక్కలు లేవని ఇది చాలా బాధాకరమని అన్నారు.
1931లో బ్రిటిష్ వాళ్లు చేసిన లెక్కలే తప్ప ఇప్పటివరకు బీసీ కులాల లెక్కలు లేవన్నారు. ఈ దేశ జనాభాలో 60 శాతం ఉన్న బీసీ కులాలు వారు లెక్కలు తెలుసుకొని వారి వాటా కొరకు పోరాటం చేస్తే తమ ఉనికి కోల్పోతామని భయంతో ప్రభుత్వాలు ఆధిపత్య వర్గాల చేతిలో ఉండి ఈ సమస్యను దాటవేస్తున్నాయి అన్నారు. ఇప్పటికైనా ఇప్పుడు నిర్వహిస్తున్న జనాభ లెక్కలలో బీసీ కులాల లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఇంతవరకైనా పోరాటం చేస్తామని అన్నారు. భారత ప్రధాని ఓబీసీ అయ్యి ఉండి కూడా ఈ సమస్యను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, కాసోజు విశ్వనాథం,, నల్ల సోమ మల్లన్న, కేశ బోయిన శంకర్ ముదిరాజ్ , జివ్వాజి ఇంద్రయ్య, శ్యాంసుందర్, వాడపల్లి సాయిబాబా, జిల్లా ఆదినారాయణ, కోడదల ఎల్లంరాజు, నల్ల మదు యాదవ్, దీక్షలో పాల్గొన్నారు.