అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ గేమ్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’. ఈ రియాలిటీ షోని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ తెలుగులోకి తీసుకొస్తున్నది. ఇన్నాళ్లూ వెండితెరపై సూపర్ హీరోగా సత్తా చాటిన తేజ సజ్జా ఈ రియాలిటీ గేమ్ షో కోసం వ్యాఖ్యాతగా మారారు. 20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే అత్యంత ఉద్వేగభరితమైన ఈ గేమ్ షో నాలుగు వారాలపాటు పది ఎపిసోడ్స్‌గా ప్రసారం కానున్నదని, అక్టోబర్ 15 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ మొదలవుతుందని మేకర్స్ తెలిపారు.
ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్స్, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో విడుదల కానున్నాయని వారు ప్రకటనలో పేర్కొన్నారు. హిందీలో ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లకు అద్భుతమైన స్పందన వచ్చిందని, తెలుగులో తేజ సజ్జ తనదైన స్పాంటేనియిటీ, ఎనర్జీతో ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తారనే నమ్మకంతో ఉన్నామని మేకర్స్ ఆశాభావం వెలిబుచ్చారు. నమ్మకం, మోసం, ద్రోహం, ఎత్తులు, పైఎత్తుల నేపథ్యంలో ‘ది ట్రైటర్స్’ గేమ్ షో సాగుతుంది.