జహీరాబాద్/కోహీర్, సెప్టెంబర్ 29 : పోలీసుల వేధింపులకు బీఆర్ఎస్ కార్యకర్త బలైన ఘటన సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కోహీర్ మండలం బిలాల్‌పూర్‌కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శేఖర్ (30) ఓ మహిళ మెడలో బంగారం చోరీ చేశాడన్న ఫిర్యాదుతో జహీరాబాద్ పట్టణ పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో విచారణ పేరుతో పోలీసులు శేఖర్‌ను విచక్షణారహితంగా కొట్టి, అవమానించి వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శేఖర్ మంగళవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు బాధిత కుటుంబానికి మద్దతుగా జహీరాబాద్ ఏరియా దవాఖానకు చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యాయం చేసేవరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. రాకపోకలు స్తంభించిపోయి, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జహీరాబాద్ డీఎస్పీ సైదానాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, నరోత్తంతో పాటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.
బీఆర్ఎస్ కార్యకర్త శేఖర్ ఆత్మహత్యకు జహీరాబాద్ పట్టణ పోలీసుల వేధింపులే కారణమని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతాప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం రాత్రి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, పార్టీ నేతలతో కలిసి ఆయన జహీరాబాద్ పట్టణ ఏరియా దవాఖానకు చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్త శేఖర్ మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
చట్ట ప్రకారం శేఖర్‌పై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించాలి కానీ.. విచక్షణారహితంగా కొట్టి వేధింపులకు గురిచేయ డం ఏందని ప్రశ్నించారు. పోలీసుల వేధింపుల వల్లనే శేఖర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని, బాధ్యులైన ఎస్సైతో పాటు పోలీసులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.