బచ్చన్నపేట, సెప్టెంబర్ 11 : బచ్చన్నపేట మండలం కేంద్రంలో శ్రీకృష్ణ పల్లకి ఉత్సవ ఊరేగింపు వైభవంగా జరిగింది.
శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ప్రబోధ సేవాసమితి హిందూ జ్ఞాన వేదిక – త్రైత సిద్ధాంతం కొన్నే ఉపేందర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శుక్రవారం పల్లకి ఉత్సవ ఊరేగింపు నిర్వహించారు.
శ్రీ కృష్ణాష్టమి నుండి నేటి వరకు పందిరిలో పూజలు అందుకున్న శ్రీకృష్ణ భగవానులవారిని ముస్తాబు చేసి పల్లకిలో.. భక్తుల కోలాటాలు, డప్పు దరువు, సన్నాయిలు.. భగవద్గీత శ్లోకాలతో జయ ద్వానాల మధ్య ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిపారు.
శ్రీకృష్ణ పల్లకి ఉత్సవ ఊరేగింపు సందర్భంగా హిందూ జ్ఞాన వేదిక జనగామ కమిటీ సభ్యులు కొన్నే ఉపేందర్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలిపిన విలువైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని బుద్ధికి జ్ఞాన తేజస్సు కలిగి ఆ కృష్ణ పరమాత్మలో ఐక్యం కావాలని కోరారు. శ్రీ కృష్ణాష్టమి రోజున పందిరిలో శ్రీకృష్ణ భగవానుడిని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈరోజు ఊరేగింపు కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడు నెమలి పింఛం, మురళి ధరించడంలో దాగున్న అంతర్యం, మన పండుగలు, హిందూ సాంప్రదాయాలు, దేవాలయ రహస్యాలు, త్రైత సిద్ధాంత భగవద్గీత లో గల సారాన్ని ఊరేగింపులో ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ హై స్కూల్, వాణి హై స్కూల్, తుమ్మబలా హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, జనగామ, కమిటీ, భువనగిరి కమిటీ, చేర్యాల కమిటీ, మహబూబాద్ కమిటీ, హుజురాబాద్ కమిటీ సభ్యులు, టీఆర్ఆర్ఎస్ రజక సంఘం భక్తులు, బచ్చన్నపేట గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.