Hair Problems | జుట్టు మెరుపు తగ్గడానికి షాంపూ, కాలుష్యం, హెయిర్ డ్రైయర్ లేదా ఇతర వేడి పరికరాలనే చాలామంది కారణాలుగా భావిస్తారు. అయితే ప్రతిరోజూ జుట్టును నల్లా నీటితో కడగడం కూడా జుట్టు నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీటిలో కాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి నీటిని హార్డ్ వాటర్‌గా పిలుస్తారు. నీటిలోని ఖనిజాలు జుట్టు తంతువులపై పేరుకుపోవడం వల్ల జుట్టు క్రమంగా మెరుపును, మృదుత్వాన్ని కోల్పోయి పొడిబారినట్లు, గరుకుగా కనిపించే అవకాశం ఉంటుంది.
హార్డ్ వాటర్‌తో జుట్టును పదేపదే కడగడం వల్ల జుట్టు తంతువులపై ఖనిజాల పొర పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా జుట్టు నిస్తేజంగా మారడంతోపాటు దాని పరిమాణం తగ్గినట్లు కనిపిస్తుంది. జుట్టు పొడిబారడం, చిక్కులు పడటం, ఎక్కువగా ఫ్రిజ్జీగా మారడం, జుట్టు తెగిపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. అలాగే షాంపూ సరిగా నురుగు రాకపోవడం కూడా నీటి నాణ్యతకు సంబంధించిన సంకేతంగా ఉంటుంది. రంగు వేసిన జుట్టు, పొడిబారిన జుట్టు లేదా వంకర జుట్టు ఉన్నవారిలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
రోజూ జుట్టు కడగడం వల్లనే సమస్య వస్తుందని చెప్పలేమని, జుట్టు రకం, నీటి నాణ్యత వంటి అంశాలపై ప్రభావం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే హార్డ్ వాటర్‌కు నిరంతరం గురికావడం వల్ల జుట్టు విరిగిపోవడం, నాణ్యత తగ్గడం, కొంతమందిలో జుట్టు రాలడం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోజుకు సుమారు 100 వెంట్రుకలు రాలడం సహజమే అయినప్పటికీ, నీటి నాణ్యతతోపాటు ఇతర కారణాలు కూడా జుట్టు రాలడాన్ని ప్రభావితం చేసే వీలు ఉంది.
జుట్టును హార్డ్ వాటర్ ప్రభావం నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనప్పుడు క్లారిఫైయింగ్ షాంపూను ఉపయోగించడం, బాత్రూమ్లో షవర్ ఫిల్టర్ ఏర్పాటు చేసుకోవడం, జుట్టుకు క్రమం తప్పకుండా డీప్ కండిషనింగ్ చేయడం వంటి చర్యలు ఉపయోగపడతాయి. వీలైతే జుట్టు కడగడానికి ఫిల్టర్ చేసిన నీటిని ఉపయోగించడం కూడా ఒక మార్గం. ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ జుట్టు విపరీతంగా పొడిబారడం, నిస్తేజంగా మారడం లేదా అధికంగా రాలడం కొనసాగితే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది.