– సిఐటియు నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
గుర్రంపోడు, సెప్టెంబర్ 11 : గుర్రంపోడు మండలంలో వీఓఏ (గ్రామ సంఘ సహాయకులు) లకు బకాయి పడిన వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఐకెపి వీవోఏ ఉద్యోగుల సంఘం (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల మహిళా సమైక్య కార్యాలయం ముందు బకాయి వేతనాల కోసం వీఓఏలు చేపట్టిన సమ్మెలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో ఎంఎస్ మీటింగ్కు రాలేదనే నెపంతో పది మందికి మూడు నెలల వేతనాలను ఏపీఎం నిర్లక్ష్యంతో ఆపేశారని మండిపడ్డారు. సీసీల నిర్లక్ష్యం వల్ల మరికొన్ని క్లస్టర్లలో గ్రేడింగ్ నమోదు చేయకపోవడంతో మొత్తం 78 మంది విఓఏలకు సంబంధించిన రూ. 3 లక్షల 90 వేల వేతనాలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం రూ.5 వేల స్వల్ప వేతనంతో ఎన్నో కష్టాలకు ఓర్చి పనిచేస్తున్న విఓఏల జీతాలను అధికారులు రకరకాల కారణాలతో ఆపితే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఏపీఎం, సీసీల నిర్లక్ష్యం వల్ల విఓఏలకు జీతాలు రావడం లేదని, వీరిని వెంటనే ఈ మండలం నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై సీసీలు, ఏపీఎంలతో పాటు పీడీకి వినతిపత్రం ఇచ్చి నెల రోజులు గడిచినా ఇప్పటివరకు సరైన స్పందన లేదని, గత్యంతరం లేకే విఓఏలు సమ్మెకు దిగారని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికైనా పీడీ చొరవ తీసుకుని వేతనాలు వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని, లేకపోతే మండల వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సిఐటియు కార్యవర్గ సభ్యులు పగిడిమర్రి సర్వయ్య, యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు సల్వాది సైదమ్మ, ఆదిరాల లక్ష్మి, నాయకులు వడ్లమాల యాదయ్య, బొంగరాల రుద్రమ్మ, రజిత, కవిత, యాదమ్మ, నాగమణి, మంజుల, పుష్ప, ప్రశాంతి, రేణుశ్రీ, సునీత, వెంకటమ్మ, విమల పాల్గొన్నారు.