ఏటూరునాగారం : నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడమే లక్ష్యంగా గిరిజన ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్య కోరారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని డీటీడీవోలు, ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల సంక్షేమాధికారులతో బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గిరిజన విద్యా నైపుణ్యాలు మెరుగు పడే విధంగా పని చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతి సౌకర్యా లు కల్పిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో వాటర్ ప్లాంటు, సోలార్ వాటర్ హీటర్స్, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాల వివరాలు రిజిస్టర్లో నమోదు చేసి పూర్తి వివరాలు ఆయా డీటీడీవోలకు అందచేయాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల భూముల వివరాలు ధరణి వెబ్సైట్లో ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని డీటీడీవోలకు సూచించారు. కిచెన్, డైనింగ్ హాల్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వాటికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్ గ్రూపులో పంపించాలన్నారు. ఫుడ్ పాయిజన్ జరుగకుండా చూడాలని, గిరి దర్శిని ద్వారా విద్యా నైపుణ్యాలు పెంపుదల, ఆన్లైన్ క్లాసుల మానిటరింగ్ పాఠ్య పుస్తకాలు పాఠశాలలు అందినాయా లేదా అనే విషయాన్ని ప్రధానోపాధ్యా యులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వసంతరావు, డిప్యూటీ డైరెక్టర్ మంకిడి ఎరయ్య మహబూబాబాద్, హన్మకొండ, జనగామ డీటీడీవోలు జహీరుద్దిన్, దిలీప్ కుమార్, ప్రేమకళ, ఏసీఎంవో సారయ్య, జీసీడీవో పద్మావతి, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.