ఖిలావరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల బాధలను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్, ప్రమాద బీమా సౌకర్యము కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. తెలంగాణ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, ఏఐసిటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులన్నిటిని కాలరాసే విధంగా ప్రైవేట్ పెట్టుబడుదారులకు అనుకూలంగా ఓలా, ఉబర్ లాంటి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి కార్మికుల పొట్ట గొడుతుందని విమర్శించారు.
కార్మిక హక్కులని కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను నూతన బానిసత్వంలోకి నెట్టే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సుల మూలంగా ఆటో కార్మికుల జీవనోపాధి కోల్పోయి వారి కుటుంబాలు పోషించుకోలేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వర్తింపజేయాలని, మహాలక్ష్మి స్కీం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు నెలకు రూ.4500 పింఛన్, ప్రమాద బీమా రూ. 10 లక్షలు, ఇచ్చి ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా రవాణా కార్మికులకు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం డీఆర్ఓ విజయలక్ష్మికి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆటో ట్రాలీ డ్రైవర్స్ జిల్లా కార్యదర్శి తాటికాయల రత్నం, రాష్ట్ర నాయకులు నర్ర ప్రతాపు, జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ సాగర్, సంఘం గౌరవ అధ్యక్షులు ఎండీ మహబూబ్ పాషా, ఆటో కార్మికుల సంఘ నాయకులు ఎస్కే దస్తగిరి, ఎంఏ సలాం, యాకూబ్ పాషా, జానీ, ఎండి. ఖలీల్, ఎస్కే లతీఫ్, దామర రమేష్, కట్కూరి భాస్కర్, తాటికాయల రాజు తదితరులు పాల్గొన్నారు.