హనుమకొండ చౌరస్తా, మే 23: పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా చూడాలనేది మా బాధ్యత అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 4వ డివిజన్ యాదవ నగర్, లోటస్ కాలనీ, 9వ డివిజన్ సుధా నగర్ లలో అంతర్గత రోడ్లు నిర్మాణం, సైడ్ డ్రైన్లకు రూ.50 లక్షలతో శంకుస్థాపనలు నగర మేయర్ గుండు సుధారాణి కలిసి చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరగతిన పనులను పూర్తిచేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.
శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగస్వామ్యం అవుతున్న పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డికి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని ప్రజల సహకారం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్, మాజీ కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.