ఐనవోలు: హనుమకొండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం పంతిని శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన శంకపెళ్లి కుమారస్వామి, నిమ్మలబోయిన రమేష్ టీవీఎస్ ఎక్సెల్ పై వరంగల్ వైపు బయలుదేరారు. ఈ క్రమంలో పంతిని చివరకు చేరుకోగానే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో రమేష్(42) మృతి చెందాడు..
ఐనవోలు మండల పరిధిలోని గత నెల 19న ఏకశిలా స్కూల్ సమీపంలో ఇల్లంద గ్రామానికి చెందిన వ్యక్తి కూడా గుర్తు తెలియని వాహనం ఢీకొని నాంపల్లి మధు (30) మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే మధును ఢీకొట్టిన వాహనం ఏదో పోలీసులు ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. అదే తరహాలో ఒకే ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృత్యువాత పడ్డారు. గుర్తుతెలియని వాహనాలను పోలీసులు త్వరగా గుర్తించి తగిన న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.