హనుమకొండ జిల్లా (ఐనవోలు): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్(Pending bills) తదితర బిల్లులు, వేతనాలు, బెనిఫిట్స్ కు నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మరుపట్ల మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ఉద్యోగుల డీఏలు, పెండింగ్ బిల్లుల గురించి అడుగవద్దు, వేతనాలు 1వ తేదీన ఇవ్వడమే గగనంగా ఉందని, రిజర్వ్ బ్యాంక్ నుంచి చేబదులుగా తీసుకుంటున్న అని అంత స్పష్టంగా చెబుతుంటే జేఏసీ సంఘాల చైర్మన్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఏ రాష్ట్రంలో కూడ ఇన్ని విధాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలన్నారు.
ఉద్యోగులకు ఏ బిల్లులు ఇప్పించలేని స్థితిలో ఇప్పుడున్న నాయకులు ఉన్నారని విమర్శించారు. ప్రజల కోసం ప్రభుత్వాలు నడుపుతారు. కానీ ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకాలమైనా ప్రజలకు చేరాలంటే ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం అన్నారు. ఎల్లప్పుడు అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు ఉద్యోగుల మీద ఇంత వివక్ష అన్నారు. ముఖ్యమంత్రి పునరాలోచించి ఉద్యోగులకు రావాల్సిన అన్ని బిల్లులు ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.