loaninsdeals | ఆ యువకుడిది హనుమకొండ. ఐటీలో చాలా ఏండ్లు పనిచేశాడు. కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించినప్పుడు.. అప్పుల మార్కెట్ గుర్తుకొచ్చింది. బీమా వ్యాపారం కండ్లముందు కదిలింది. ఈ రెండు సేవలనూ ఒకే వేదిక ద్వారా అందించాలనే ఆలోచనతో ‘లోన్ఇన్స్డీల్స్’కు ప్రాణంపోశాడు సుకుమార్ మాడిశెట్టి.
మనమేదో ముఖ్యమైన పనిలో ఉంటాం. ఫోన్ రింగవుతుంది. ఎత్తగానే ‘లోన్ కావాలా సర్! తక్కువ వడ్డీ రేటుకే..’ అంటూ అవతలి నుంచి ఓ గొంతు వినిపిస్తుంది. ఒకసారి, రెండుసార్లు అయితే ఫర్వాలేదు. పొద్దస్తమానం విసిగిస్తూ ఉంటారు. దీంతో నంబర్ బ్లాక్ చేయాలన్నంత కోపం వస్తుంది. ఆ టెలీకాలర్స్ వైపు నుంచి ఆలోచించినా.. వందమందికి కాల్ చేస్తే.. ఒకరో ఇద్దరో మాత్రం స్పందిస్తారు. తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చి, బీమా సౌకర్యం కల్పిస్తామని ఊదరగొట్టినా.. పట్టించుకునే వారు ఉండరు. మరోవైపు ఎవరైనా అవసరం కొద్దీ లోన్ కోసం ప్రయత్నిస్తే.. వడ్డీ తగ్గించమని అడిగే పరిస్థితే ఉండదు. చెప్పిన ధరకు తీసుకోవాల్సిందే. ఆ వడ్డీలు కట్టలేక రక్తమాంసాలు ఆవిరైపోతాయి. ఇక ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి తీసుకుంటే.. కొరివితో తలగోక్కున్నట్టే. ఆ ఇబ్బందులు లేకుండా.. కస్టమర్‌కూ, లోన్, బీమా ఏజెంట్లకూ మధ్య వారధిగా నిలుస్తుంది ‘లోన్ఇన్స్డీల్స్’. లోన్ అంటే రుణం.. ఇన్స్ అంటే ఇన్సూరెన్స్.. డీల్స్ అంటే నచ్చిన రేటుకు మాట్లాడుకోవడం.
ఈ కంపెనీ వెనుక ఓ హనుమకొండ కుర్రాడు ఉన్నాడు. పేరు సుకుమార్ మాడిశెట్టి. ‘మేం ముగ్గురం అన్నదమ్ములం. పెద్దన్నయ్య, రెండో అన్నయ్య విదేశాల్లో స్థిరపడ్డారు. మాకు రెండు ఐటీ కంపెనీలు ఉన్నాయి. వికాజన కంపెనీకి దేశ, విదేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. వికాజనలో లోన్ఇన్స్డీల్స్ అంతర్భాగం. నేను దానికి సీఈఓ, కోఫౌండర్‌గా వ్యవహరిస్తున్నాను. నాకున్న 16 ఏండ్ల ఐటీ అనుభవంతో ఈ కంపెనీ ప్రారంభించాను. లోన్ బాధలు నాకూ తెలుసు కాబట్టే.. ఈ మార్కెట్ ప్లేస్‌ను అందుబాటులోకి తెచ్చాను. ఓ సర్వీస్ ప్రొవైడర్‌గా నేను చెప్పేదొక్కటే.. లోన్, బీమా కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఏజెంట్లతో సూటిగా మాట్లాడండి. వీలైతే కొంచెం టైమ్ తీసుకుని మళ్లీ మాట్లాడండి. నచ్చిన రేటుకు లోన్ తీసుకోండి. డబ్బు ఎవరికీ ఊరికే రాదు’ అని ఆత్మీయంగా సలహా ఇస్తారు సుకుమార్.
‘లోన్ఇన్స్డీల్స్’ ద్వారా లోన్, బీమా సేవల్లో ఎలాంటి మోసాలూ జరగకుండా మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏజెంట్ల నేపథ్యాన్ని పరిశీలించిన తర్వాతే తమ వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. గతంలో వారిపై నమోదైన కేసులు, జరిపిన లావాదేవీలు, ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకులు, రేటింగ్, మాటతీరు, పనితీరు.. ఇలా అన్ని కోణాల్లో తనిఖీ చేస్తారు. ‘లోన్ఇన్స్డీల్స్’ ద్వారా క్విక్ లోన్ సదుపాయం కూడా ఉంది. యాప్, వెబ్సైట్లో రిజిస్టర్ కాకుండానే వివరాలు నమోదు చేసి, సంబంధిత ఏజెంట్‌తో మాట్లాడుకొని లోన్ పొందొచ్చు. ప్రస్తుతం ఈ మార్కెట్ ప్లేస్ ద్వారా 3వేలకు పైగా వినియోగదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకున్నారు. 1100 మందికిపైగా లోన్, బీమా ఇచ్చే ఏజెంట్లు ఇందులో నమోదయ్యారు. ఇప్పటివరకూ 15వేలకు పైగా ప్రతిపాదనలు జరిగాయి. గత జనవరిలో తెలుగు రాష్ర్టాల్లో సేవలు ప్రారంభించిన ఈ మార్కెట్ ప్లేస్.. అనతి కాలంలోనే పదకొండు రాష్ర్టాలకు విస్తరించింది. మరో 17 రాష్ర్టాల్లో సేవలకు సన్నాహాలు చేస్తున్నారు సుకుమార్. ‘ఇదొక అప్పుల బజార్. రుణాలు, బీమా సౌకర్యం కావాలనుకునేవారు LoanInsDeals వెబ్సైట్/యాప్‌లో ఉచితంగానే రిజిస్టర్ కావచ్చు. తక్షణం మీ ఆర్థిక అవసరాలను బట్టి ఒకేసారి పదిమంది ఏజెంట్లు, ఆయా బ్యాంకుల వడ్డీరేట్లు, నియమ నిబంధనలతో ముందుకొస్తారు. నచ్చితే కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. బేరమాడొచ్చు. సందేహాలు తీర్చుకోవచ్చు. బెస్ట్ డీల్‌ను ఎంచుకోవచ్చు. మంచి ఏజెంట్‌ను పరిచయం చేయడం వరకే మా పని. నిర్ణయం తీసుకోవాల్సింది కస్టమర్ మాత్రమే’ అని వివరిస్తారు సుకుమార్.
…✍ రవికుమార్ తోటపల్లి
“యూపీఐ పేమెంట్స్ తరహాలో బీమా సుగమ్ సక్సెస్ అవుతుందా?!”